Rahul Gandhi: రాహుల్‎కు తెలంగాణ వంటలు ఎలా అనిపించాయి అంటే?

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - January 23, 2023 / 08:38 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్ర ఎన్నో రాష్ట్రాల మీదుగా సాగుతుండగా.. తాజాగా రాహుల్ గాంధీ కర్లీ టేలర్స్ అనే మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో యాంకర్ కామియా జానీ అడిగిన పలు వ్యక్తిగత ప్రశ్నలకూ రాహుల్ గాంధీ సమాధానాలు చెప్పారు. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంలో రాహుల్.. ఈ ఇంటర్వ్యూ ఇవ్వగా.. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రాహుల్ గాంధీ డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? ఇంతకీ ఏం తింటారు అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి రాహుల్ గాంధీ సమాధానమిస్తూ.. ‘సాధారణంగా ఇంట్లో ఉంటే డైట్ విషయంలో ఖచ్చితంగా ఉంటా. కానీ జోడో యాత్రలో అన్నీ అందుబాటులో ఉండవు కదా. అయితే భోజం గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తా. కానీ బఠాణీ, పనసపండు మాత్రం అస్సలు నచ్చవు’ అని చెప్పుకొచ్చాడు.

ఇక తన యాత్రలో భాగంగా చాలా రాష్ట్రాల్లో వంటకాల రుచి చూశానని చెప్పుకొచ్చిన రాహుల్ గాంధీ.. తెలంగాణ వంటల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సంప్రదాయాల్లాగే ఆహారంలో చాలా వ్యత్యాసాలున్నాయి. అయితే తెలంగాణ వంటకాలు నాకు కాస్త ఘాటుగా అనిపించాయి. అక్కడ కారం కాస్త ఎక్కువ. అంత నేను తినలేను’ అని రాహుల్ గాంధీ తెలంగాణ వంటకాల గురించి వ్యాఖ్యానించారు. ఉత్తరాదిలో మామూలుగానే కారం తక్కువ తినే అలవాటు ఉండగా, దక్షిణాదిలో, అందులోనూ తెలంగాణలో కారం కాస్త ఎక్కువే తింటారు అని రాహుల్ గాంధీ వీడియోలు కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరోపక్క పెళ్లి విషయం మీద కూడా రాహుల్ గాంధీ స్పందించాడు. తాను పెళ్లి చేసుకుంటానని వివరించిన రాహుల్.. కానీ ఓ మెలిక పెట్టాడు. పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లికి నేను వ్యతిరేకం కాదు. అయితే ఒక సమస్య ఏంటంటే మా అమ్మానాన్నలది ప్రేమ వివాహం. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందువల్ల నా అంచనాలు కాస్త పైనే ఉంటాయి. అయితే సరైన అమ్మాయి వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ప్రేమించే వ్యక్తి, తెలివైన అమ్మాయి అయితే చాలు’ అని అన్నాడు.