Site icon HashtagU Telugu

Hongkong: హాంకాంగ్ ని ముంచెత్తుతున్న భారీ వరదలు.. 140 ఏళ్ల తర్వాత అలా?

Hongkong

Hongkong

ప్రస్తుతం చాలా ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలావరకు ప్రదేశాలు నీట మునిగిపోవడంతో పాటు కోట్లల్లో ఆస్తి నష్టం జరుగుతోంది. తాజాగా హాంకాంగ్‌ లో ఎప్పుడు లేని విధంగా దాదాపు 140 ఏళ్లలో మొదటిసారి భయంకరమైన వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం హాంకాంగ్‌, దక్షిణ చైనాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్‌వేలు మొత్తం నీట మునిగిపోవడంతో పాఠశాలలను మూసివేశారు.

హాంకాంగ్‌ మహానగరం 140 ఏళ్లలో ఈ స్థాయి కుంభవృష్టిని చూడలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పల్లపు ప్రాంతాల ప్రజలను రక్షించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. గత 24 గంటల్లో దాదాపు 83 మంది ఆసుపత్రి పాలైనట్లు అత్యవసర విభాగం అధికారులు వెల్లడించారు. కాగా ఈ హాంకాంగ్‌ నగరంలో దాదాపు 75 లక్షల మంది జీవిస్తున్నారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 లోపు 1 58.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1884 తర్వాత ఒక గంటలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే.

Hong Kong

క్వోలూన్‌, నగర ఉత్తర ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి లోపు 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడింది. నగరంలోని కొన్ని చోట్ల గత 24 గంటల్లో 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవలే అత్యంత బలమైన టైఫూన్‌ బారిన పడి కోలుకొంటున్న ఈ నగరంపై తాజా వరదలు దెబ్బకొట్టాయి. అప్పట్లో అనగా 1884 తర్వాత దాదాపు 2023లో మళ్ళీ ఇలాంటి కుంభవృష్టి వర్షాలు కురిసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అవడంతో పాటు చిన్న చిన్న వాగులు వంకలు అన్ని పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా వరద కారణంగా నగరంలో చాలా చోట్ల రవాణా సేవలు, వ్యాపారాలు నిలిచిపోయాయి. నగరంలో అతిపెద్ద వర్షపాత హెచ్చరిక అయిన బ్లాక్‌ ను గురువారం సాయంత్రమే జారీ చేశారు.

హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ కూడా ఉదయం ట్రేడింగ్‌ను నిలిపివేసింది. అత్యవసరమైన ఉద్యోగులను మాత్రమే కార్యాలయాలకు పిలిపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన వారు ఇళ్లకే పరిమితం కావాలని తెలిపింది. వాంగ్‌తాయ్‌ జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్‌ పూర్తిగా నీటమునిగింది. దీంతో రైల్వే శాఖ కూడా సేవలను నిలిపివేసింది. మరోవైపు బస్సులు కూడా ఎక్కడిక్కడే స్తంబించి పోయాయి. సాయంత్రం వరకు వరద తీవ్రత తగ్గే అవకాశం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. నగరాన్ని క్వోలూన్‌ ద్వీపకల్పంతో అనుసంధానించే మార్గం కూడా వరదల్లో చిక్కుకొంది.