Site icon HashtagU Telugu

Sucharitha: ఎవ‌రినీ అరెస్ట్ చేయ‌లేదు.. చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్దం‌..!

Home Minister

Home Minister

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు రాష్ట్ర న‌టుమూల‌ల నుండి ప్ర‌భుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు తరలి వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈనేపధ్యంలో బీఆర్టీఎస్ రోడ్డులోకి ఎంట్రీ ఇవ్వ‌కుండా అన్ని వైపులా పోలీసుల్ని మోహ‌రించడ‌మే కాకుండా ఎక్క‌డిక‌క్క‌డ ఆంక్ష‌లు విధించింది ఏపీ స‌ర్కార్.

అయితే రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగులు వేల సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో పోలీసులు ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నార‌టి వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మంలో భాగంగా ఉద్యోగ సంఘాల నేత‌ల్ని, ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎవరినీ అరెస్ట్ చేయలేదని రాష్ట్ర హోం మంత్రి మేక‌తోటి సుచరిత తెలిపారు.

ప్ర‌స్తుతం కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని, దీంతో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి, ఇలాంటి కార్యక్రమాలు చేపడితే, రాష్ట్రంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని సుచరిత ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పై ప్ర‌భుత్వం కానీ పోలీసులు కానీ ఎలాంటి ఉక్కు పాదం మోపలేదని, ఎవ‌రినీ అరెస్ట్‌లు చేయ‌లేద‌ని ఆమె అన్నారు.

ఇక ఉద్యోగుల స‌మ‌స్య‌లు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని, చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్ధమని ఆమె అన్నారు. ఉద్యోగులు సహకరించాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా చెప్పారని, చర్చలకు కమిటీ కూడా వేశామని సుచ‌రిత‌ తెలిపారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంద‌ని, కరోనాతో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయ‌ని సుచ‌రిత స్ప‌ష్టం చేశారు.