Yuvraj Singh: బట్లర్ పై యువరాజ్ ప్రశంసలు

ఐపీఎల్ లో పలువురు విదేశీ ఆటగాళ్ళు తమ ఆటతీరుతోనే కాదు క్రీడాస్ఫూర్తితోనూ ఆకట్టుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - April 15, 2022 / 12:21 AM IST

ఐపీఎల్ లో పలువురు విదేశీ ఆటగాళ్ళు తమ ఆటతీరుతోనే కాదు క్రీడాస్ఫూర్తితోనూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ పై భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ లో బట్లర్ లాంటి జెంటిల్మెన్ ప్లేయర్స్ ఉన్నందునే ఆటకు గౌరవం పెరుగుతుందన్నాడు. గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ బట్లర్ క్రీడాస్ఫూర్తికి వేదికగా నిలిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో గుజరాత్ కెప్టెన్ కొట్టి షాట్ ను బౌండరీ దగ్గర ఆపే క్రమంలో బట్లర్ డైవ్ చేశాడు. ఈ సమయంలో బంతిని అందుకునేటప్పుడు అతని కాలు బౌండరీ రోప్ కు తగిలినట్టు కనిపించింది. దీనిపై ఫీల్డ్ అంపైర్ ఏం స్పందించకున్నా… త్రో వేసిన తర్వాత బట్లర్ స్పందించాడు. అంపైర్ ను పిలిచి టీవీ రీప్లే చూడమని కోరడం వీడియోలో కనిపించింది.

బౌండరీ లైన్ ను తాకానో లేదో తనకైతే స్పష్టంగా తెలియదని థర్డ్ అంపైర్ ను సంప్రదించమని ఫీల్డ్ అంపైర్ కు సూచించాడు. బట్లర్ నిజాయితీపై కామెంటేటర్లతో పాటు యువరాజ్ సింగ్ కూడా ప్రశంసలు కురిపించాడు. జెంటిల్మెన్ గేమ్ లో ఇంకా జెంటిల్మెన్ ఉన్నారంటూ యువీ ట్వీట్ చేశాడు. అతని సహచరులు బట్లర్ ను చూసి నేర్చుకోవాలంటూ యువీ ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఒకవైపు బట్లర్ ను పొగుడుతూనే రాజస్థాన్ జట్టులోనే ఉన్న రవిచంద్రన్ అశ్విన్ కు యువీ సెటైర్లు వేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మంకడింగ్ ద్వారా అశ్విన్ వార్తల్లో నిలిచినప్పుడు కొందరు విభేదిస్తే.. మరికొందరు మద్ధతుగా నిలిచారు. అయితే ఫలితం ఎలా ఉన్నా క్రీడాస్ఫూర్తి ఖచ్చితంగా ఉండాలన్నది యువీ అభిప్రాయం. ఇప్పుడు బట్లర్ సంఘటనతో దీనిని మరోసారి గుర్తు చేశాడంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా ఆన్ ది ఫీల్డ్ లో బట్లర్ చూపిన నిజాయితీ ఇప్పుడు ప్రశంసలు అందుకూంటోంది.

Photo Courtesy: IPL/Twitter