Hirings Cancelled: ఆఫ‌ర్ లెట‌ర్లు ఇచ్చారు.. అపాయింట్మెంట్ మరిచారు.. ఫ్రెష‌ర్స్‌కు టెక్ దిగ్గ‌జాల షాక్ !!

వందలాది మంది ఫ్రెష‌ర్స్‌.. మూడు, నాలుగు నెలల కిందట ఎంతో కష్టపడి టాప్ లెవల్ ఐటీ కంపెనీలో జాబ్ కోసం ఎగ్జామ్స్ రాశారు.

  • Written By:
  • Publish Date - October 4, 2022 / 06:15 AM IST

వందలాది మంది ఫ్రెష‌ర్స్‌.. మూడు, నాలుగు నెలల కిందట ఎంతో కష్టపడి టాప్ లెవల్ ఐటీ కంపెనీలో జాబ్ కోసం ఎగ్జామ్స్ రాశారు. ఎన్నో రౌండ్లు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. “సెలెక్ట్ అయ్యారు” అంటూ వాళ్లకు ఆ ప్రముఖ ఐటీ కంపెనీలు ఆఫర్ లెటర్లు కూడా ఇష్యూ చేశాయి.

ఆ తర్వాత అదిగో.. ఇదిగో అంటూ అపాయింట్మెంట్ ఇవ్వడంలో నెలల తరబడి ఆలస్యం చేశాయి.తాజాగా యూట‌ర్న్ తీసుకున్నాయి. ఫ్రెష‌ర్స్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ లెట‌ర్ల‌ను రద్దు చేసినట్లు ప్రకటించాయి. ఆఫర్ లెటర్లను చూపించి ఎవరైనా ప్రశ్నిస్తే సింపుల్ గా వాటిని రిజెక్ట్ చేస్తున్నాయి. అర్హ‌తా నిబంధ‌న‌లు, కంపెనీ మార్గ‌ద‌ర్శ‌కాలను అనుసరించి ఆఫ‌ర్ లెట‌ర్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ఆయా కంపెనీలు చెబుతున్నాయ‌ని ఎంపికైన అభ్య‌ర్ధులు వాపోతున్నారు.

అంత‌ర్జాతీయంగా ఐటీ రంగంలో మంద‌గ‌మ‌నం, వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్న నేప‌ధ్యంలో ఈ ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. వ‌డ్డీరేట్ల పెంపు, మార్కెట్ల‌లో లిక్విడిటీ త‌గ్గుద‌ల‌, మాంద్యం ప‌రిస్ధితుల‌తో టెక్ స్టార్ట‌ప్‌ల నుంచి టెక్ దిగ్గ‌జాల వ‌ర‌కూ ఐటీ కంపెనీలు గ‌డ్డు ప‌రిస్ధితులు ఎదుర్కొంటున్నాయి. బహుశా ఈ కారణం వల్లే ఆయా ఐటీ కంపెనీల అంచనాలు తలకిందులు అయి ఉంటాయని.. అందువల్లే కొత్త రిక్రూట్మెంట్ ను అవి అకస్మాత్తుగా ఆపేసి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ కూడా కొత్త వారిని నియమించుకోబోమని ఇప్పటికే చెప్పేశాయి. అంతేకాకుండా.. సంస్థలో అందుబాటులో ఉన్న వనరులతోనే ఉత్పాదకత పెంచేందుకు నిర్ణయించాయి.