Site icon HashtagU Telugu

TTD: హిందూ ధర్మప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీటీడీ చైర్మన్ భూమన

TTD make new Decisions in Leopards Issue at Tirumala

TTD make new Decisions in Leopards Issue at Tirumala

TTD: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది.
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు భూమన కరుణాకర రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తాను తొలిసారి చైర్మన్ గా ఉన్న సమయంలో రెండు సార్లు ధార్మిక సదస్సలు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాలను నిర్వహించి భగవంతుడిని భక్తుల చెంతకే తీసుకుని వెళ్ళామని చెప్పారు.

స్వామివారి కి సంకీర్తనలతో సేవ అందించిన అన్నమాచార్య, పురందరదాసు, కనక దాసు, తరిగొండ వెంగమాంబ ల పేర్లతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. తాను తొలిసారి చైర్మన్ గా ఉన్న సమయంలో స్వామీజీల సూచనలతోనే ఎస్వీ బీసీ చానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని గుర్తు చేశారు. వేద పరిరక్షణ కోసం వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తున్న టీటీడీ మీద అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందని కరుణాకర రెడ్డి స్వామీజీలకు విన్నవించారు.

మీ ఆశీస్సులతో, సలహాలు, సూచనలను శాసనంగా భావించి టీటీడీ ధర్మ ప్రచారానికి పునరంకితం అవుతుందని ఆయన స్వామీజీలకు విన్నవించారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే తగిన సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కరుణాకర రెడ్డి చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు.