Modi Comments: హిందీపై రగడ.. ఇదీ మోదీ మాట

భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలం అన్నారు ప్రధాని మోదీ. దేశంలో ఉన్న భాషా వైవిధ్యమే మనకు గర్వకారణమని చెప్పుకొచ్చారు.

  • Written By:
  • Updated On - May 21, 2022 / 02:56 PM IST

భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలం అన్నారు ప్రధాని మోదీ. దేశంలో ఉన్న భాషా వైవిధ్యమే మనకు గర్వకారణమని చెప్పుకొచ్చారు. ప్రతి ప్రాంతీయ భాషను రక్షించేందుకు, దానికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకునే జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. అయితే, దురదృష్టవశాత్తు దీనిపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాజస్తాన్‌ జైపూర్‌లో బీజేపీ ఆఫీస్ బేరర్ల జాతీయస్థాయి సమావేశం ప్రారంభం సందర్భంగా మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. నిజానికి హిందీని జాతీయ భాషగా పరిగణించాలా వద్దా అనే దానిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు హిందీని జాతీయ భాషగా వ్యతిరేకిస్తున్నాయి. ఏవో నాలుగు రాష్ట్రాలు హిందీ మాట్లాడినంత మాత్రాన.. ఆ ఒక్క భాషనే జాతీయ భాషగా ఎలా గుర్తిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

నిజానికి హిందీ జాతీయ భాష కాదు. ప్రస్తుతం అది అధికార భాషగానే చలామణి అవుతోంది. భారతదేశానికి జాతీయ భాష అనేది లేనే లేదు. ఇండియాలో గుర్తింపు పొందిన 22 భాషల్లో హిందీ కూడా ఒకటి. అంతే తప్ప.. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు. అయితే ఆర్టికల్ 343(1) ప్రకారం దేవనాగరి లిపి, హిందీ, ఇంగ్లీష్ భాషలను అధికారిక భాషలుగా పేర్కొన్నారు. ఈ లెక్కన హిందీ అధికారిక భాష మాత్రమే. అంటే కేవలం పరిపాలన భాషగా మాత్రమే ఉంది. ఒకవేళ హిందీని నేషనల్ లాంగ్వేజ్‌గా గనక ప్రకటిస్తే.. అన్నిటికీ హిందీని జోడించాల్సి ఉంటుంది. కాని, ఇలా చేయాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మరోవైపు అధికార భాషా సంఘం పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దేశ ఐకమత్యం కోసం హిందీని ముఖ్య భాగంగా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం వాళ్లు మరో రాష్ట్రం వాళ్లతో మాట్లాడుకోడానికి హిందీని మాధ్యమంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. హిందీ అనేది ఇతర భాషలకు ప్రత్యామ్నాయంగా చూడొద్దని, కేవలం ఇంగ్లీష్‌కు ప్రత్యామ్నాయంగానే చూడాలని పేర్కొన్నారు. అంటే.. దేశంలోని వివిధ ప్రాంతాల వాళ్లు మాట్లాడుకోవాల్సి వస్తే అది దేశ భాష అయిన హిందీలోనే జరగాలి తప్ప.. ఇంగ్లీష్‌లో కాదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు.