Narsipatnam : న‌ర్సీప‌ట్నంలో ఉద్రిక్త‌త‌.. టీడీపీ నేత అయ‌న్న ఇంటిని..?

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 09:18 AM IST

అన‌కాప‌ల్లి జిల్లా న‌ర్సీప‌ట్నంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. టీడీపీ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ‌న్న‌పాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. తెల్ల‌వారుజామున 3 గంట‌ల ప్రాంతంలో అయ‌న్న ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసుల‌తో పాటు రెవెన్యూ అధికారులు కూడా అక్క‌డికి వ‌చ్చారు. అయ‌న్న ఇంటిగోడ ప్ర‌భుత్వ భూమిలో ఉందంటూ జేసీబీల‌తో గోడ‌ని కూల్చారు. అయితే త‌మ‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లో భాగంగా ఇదంతా జ‌రుగుతుంద‌ని అయ‌న్న కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. అయ్యన్న గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మ‌వ‌తి ఆరోపించారు. జనం తరపున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా..? బీసీలుగా పుట్టడమే నేరమా.. అని ఆమె ప‌శ్నించారు. నర్సీపట్నంలో మున్సిపల్‌ సిబ్బంది తీరును అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు చింతకాయల రాజేశ్‌ ఖండించారు. మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని చెప్పారు. ల్యాండ్‌ పర్మిషన్‌ ఇచ్చాకే కట్టామని రాజేశ్‌ తెలిపారు. న్యాయంగా ఇల్లు కట్టుకున్నామని.. ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని రాజేశ్‌ ఆరోపించారు. అధికారులు మాత్రం ఆక్రమణలో ఉన్నందునే కూల్చివేశామని చెబుతున్నారు. మరోవైపు అయ్యన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను అరెస్ట్‌ చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులతో కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. .