GST : ‘జీఎస్టీ’ అంటే ‘గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్’. 2017 జులై 1న మన దేశ పార్లమెంటులో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ అంటే ‘గుడ్ అండ్ సింపుల్’ అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు నిజమేనని అందరూ నమ్మారు. ఎందుకంటే ఆ సమయానికి వివిధ రకాల వస్తువులు, సేవలపై 17 రకాల వేర్వేరు పన్నులు విధించేవారు. వాటన్నింటి స్థానంలో తీసుకొచ్చిన ఏకైక పన్ను వ్యవస్థ జీఎస్టీతో మేలు జరుగుతుందని అందరూ ఆశించారు. కట్ చేస్తే.. గత కొంతకాలంగా జీఎస్టీ వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే పెరిగిపోయాయి. చివరకు పాప్‌కార్న్, పాత కారులను కూడా వదలకుండా జీఎస్టీని బాదుతుండటమే ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం.
Also Read :BRS Vs Congress : 2024లో కాంగ్రెస్ సర్కారు పాలనపై ట్వీట్ల యుద్ధం
జీఎస్టీ అంటే ఏమిటి?
జీఎస్టీ (GST) అనేది ఒక వినియోగ పన్ను. దీన్ని పరోక్షంగా వస్తువులు, సేవలపై విధిస్తుంటారు. ఉదాహరణకు మీరు దుకాణానికి వెళ్లి ఒక టీవీని(వస్తువు) కొన్నా.. బ్రాండెడ్ సెలూనుకు వెళ్లి జుట్టును కటింగ్ (సేవ) చేయించుకున్నా జీఎస్టీ వర్తిస్తుంది. జీఎస్టీని నేరుగా కేంద్ర ప్రభుత్వమే వసూలు చేస్తుంది. తదుపరిగా జీఎస్టీ ద్వారా వసూలైన మొత్తం నుంచి రాష్ట్రాలకు వాటి వాటాను అందజేస్తుంది. 2017 సంవత్సరానికి మునుపు.. వస్తు,సేవలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పన్నులను విధించేవి. ఫ్యాక్టరీలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని విధించేది. రెస్టారెంట్లలో భోజనం బిల్లులు, ఫోన్ బిల్లులు వంటి వాటిపై సర్వీస్ టాక్స్‌ను కేంద్ర సర్కారు వసూలు చేసేది. దీంతోపాటు ప్రతీ రాష్ట్రం తమ సరిహద్దుల మీదుగా రవాణా చేసే వస్తువులపై విక్రయ పన్ను (సేల్స్ టాక్స్)ను వసూలు చేసేది.
Also Read :Kerala Nurse Vs Yemen: యెమన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష.. రంగంలోకి భారత్.. ఏమిటీ కేసు ?
జీఎస్టీ వచ్చాక ఏమైందంటే.. ?
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పన్నుల వసూళ్లు ఒకే ఛానల్‌లోకి చేరిపోయాయి. ప్రస్తుతం మద్యం, పెట్రోల్, డీజిల్ మాత్రమే జీఎస్టీ పరిధికి బయట ఉన్నాయి. అందువల్ల వాటి ధరలు దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
జీఎస్టీ స్లాబ్స్, సెస్ ఇలా..
‘‘ఒకే దేశం, ఒకే పన్ను’’ అనే నినాదంతో జీఎస్టీ విధానం ప్రారంభమైంది. వాస్తవానికి మనదేశంలో జీఎస్టీకి సంబంధించి 6 రకాల విభిన్న పన్ను రేట్లు ఉన్నాయి. ప్రధానమైన జీఎస్టీ పన్ను శ్లాబ్స్.. 5%, 12%, 18%, 28%. వీటికి తోడు కొన్ని వస్తువులపై అదనపు సెస్ (అత్యధిక పన్ను)ను కూడా విధిస్తుంటారు. జీఎస్టీ పన్ను వ్యవస్థలో ఇలాంటి అంశాలే జటిలతను తీసుకొస్తున్నాయి. దాన్ని చిక్కుముడులతో నిండిపోయిన క్లిష్టమైన విధానంగా మార్చేస్తున్నాయి. పాప్ కార్న్ వంటి సాధారణ వస్తువులపైనా జీఎస్టీ బాదుడు దేశ ప్రజలు అందరినీ ఆశ్చర్యపర్చింది. ఓపెన్ పాప్‌కార్న్‌పై 5 శాతం పన్ను, ప్యాకేజ్డ్ పాప్‌కార్న్‌పై 12 శాతం పన్ను, కేరమెల్స్ కలిపిన పాప్ కార్న్‌పై 18 శాతం పన్ను ఉంటుంది.
జీఎస్టీ కౌన్సిల్.. రాష్ట్రాల ఒత్తిడి
మన దేశంలో జీఎస్టీ రేట్లపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భాగస్వాములుగా ఉంటాయి. రాష్ట్రాలు తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ కౌన్సిల్ వేదికగా ప్రయత్నాలు చేస్తుంటాయి. అందుకే తరచుగా జీఎస్టీ పన్ను శ్లాబ్‌లను మార్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది.
ట్యాక్స్ రేట్లు తగ్గిస్తే ఏమవుతుంది ?
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించాలని భావిస్తే చాలా పరిణామాలు ఎదురవుతాయి. పన్ను రేట్లను తగ్గిస్తే.. ప్రభుత్వ ఖర్చులను, కేటాయింపులను కూడా అందుకు అనుగుణంగా తగ్గించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పెరిగే ఖర్చులను నిర్వహించేందుకు ఆర్థిక నియంత్రణ చర్యలను తప్పనిసరిగా అమలు చేయాల్సి వస్తుంది.
ముగింపు
జీఎస్టీ అనేది “గుడ్ అండ్ సింపుల్”గా ప్రారంభమైనప్పటికీ.. వివిధ పన్ను శ్లాబ్స్, సెస్, రాష్ట్రాల అంగీకారాలతో ఏర్పడిన జటిలత వల్ల అది అంత సులభంగా కనిపించడం లేదు. ఈ జటిలతను పరిష్కరించేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది.