Heavy Rains In Telangana : భారీ వ‌ర్షాల‌కు నీట‌మునిగిన పంట‌లు.. భారీగా పంట న‌ష్టం

తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఇటీవల చేపట్టిన పంట తోటల్లో దాదాపు పదోవంతు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Written By:
  • Updated On - July 13, 2022 / 07:42 AM IST

తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఇటీవల చేపట్టిన పంట తోటల్లో దాదాపు పదోవంతు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీగ పంట న‌ష్టం వాటిల్లింది. ఖరీఫ్ సీజన్‌లో 55 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్ జరుగుతుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం… 5 లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తి, మొక్కజొన్న మరియు సోయాబీన్, ఇతర పంట‌లు దెబ్బతిన్నాయి. నిరంతర వర్షాల కారణంగా అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టలేకపోయారు.ఇప్పటికే రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిస్తే మట్టి కొట్టుకుపోయి నారు నాశనమైతే విత్తే ప్రక్రియ మొత్తం మళ్లీ చేప‌ట్టాల్సి వ‌స్తుంద‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఇన్‌పుట్ సబ్సిడీ లేదా పంట నష్టపరిహారం పొందేందుకు వీలుగా వ్యవసాయ శాఖ అధికారుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా రైతులకు పంట నష్టపరిహారం చెల్లించడం లేదని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. దెబ్బతిన్న వ్యవసాయ పొలాల వద్ద మంత్రుల బృందం పర్యటించి హామీ ఇచ్చినప్పటికీ పరిహారం రాబట్టడంలో విఫలమైన సందర్భాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల అధికారులు రైతులకు పంట నష్టాలను తగ్గించడానికి మార్గదర్శకాలను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టానికి వెంటనే పరిహారం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట బీమా సౌకర్యం లేకపోవడంతో పంట నష్టాల కారణంగా తాము భారీగా నష్టపోతున్నామ‌ని.. వ్యవసాయ పొలాల్లో పంట నష్టాలను అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు.