తెలంగాణలోని వరంగల్ (Warangal ) నగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Rahul : సీక్రెట్ వెకేషన్లో రాహుల్
భారీ వర్షాల కారణంగా నగరంలోని అండర్ బ్రిడ్జి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమయానికి అక్కడికి చేరుకుని, బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పోలీసులు, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూశారు.
వరంగల్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నట్లు సమాచారం. ఈ వర్షాల వల్ల ఈ ప్రాంతాల్లో కూడా సాధారణ జీవితంపై ప్రభావం పడుతోంది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున, అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.