దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడి, వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఇది తీరంవైపుగా దూసుకొస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని నాగపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని మరికొద్ది గంటల్లో తీవ్రవాయుగుండం మారి తమిళనాడు వైపుగా రానుందని సమాచారం.
దీంతో తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తమిళనాడు, రాయలసీమ, దక్షిణకోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఇప్పటికే సముద్రం లోపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ సూచింది. దాదాపు 45 కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్పమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
