Heavy Rains: తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. వర్షపాతం గణాంకాలు కూడా ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో 616.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ సాధారణ వర్షపాతం 15.6 మిల్లీమీటర్లు మాత్రమే. కానీ 616.5 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం చిట్యాలను అతలాకుతలం చేసింది. ఒక ఏడాదిలో చిట్యాలలో కురవాల్సిన వర్షంలో దాదాపు 70శాతం వరకు ఇప్పుడు కవర్ అయింది. చిట్యాలతోపాటు చేల్పూరు, రేగొండ, మొగుల్ల పల్లి.. ములుగు జిల్లా లక్ష్మీదేవి పేటలో భారీ వర్షాలు కురిశాయి. ఊహించని విధంగా కురిసిన వర్షాలతో తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి.
తెలంగాణలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయితే అది భారీ స్థాయి అని చెప్పుకోవాలి. 115.60 మిల్లీమీటర్లు దాటితే అతి భారీ.. 204.5 మిల్లీమీటర్లు దాటితే అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్టు లెక్క. కానీ ఈసారి అత్యంత భారీ అనేది నామమాత్రంగా మారింది. వరంగల్, జనగాం, ఆదిలాబాద్, హన్మకొండ, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ప్రకృతి ప్రకోపానికి నిదర్శనంగా నిలిచాయి. ఆయా జిల్లాల్లో 204.5 మిల్లీమీటర్లకంటే అత్యథిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకూ ఇదే అత్యథికం అనుకుంటే.. మరో రెండురోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో మరింత విధ్వంసం జరిగే అవకాశముంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Also Read: Tamil Nadu: మరోసారి బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం అంతమే