Site icon HashtagU Telugu

Viral Video: గూడు కూలే.. గుండె పగిలే.. పక్షులు నిలువ నీడ కోల్పోయిన వీడియో వైరల్

“నీ గూడు చెదిరింది.. నీ గుండె పగిలింది.. ఓ చిట్టి తల్లి నిన్నెవరు కొట్టారు.. ” అని ఒక సినీ కవి చాలా హృద్యంగా చెప్పారు.

ఇందులో సినీ కవి చెప్పిన విధంగానే ఒక చెట్టు కూలింది.వందలాది పక్షులు నిలువ నీడ కోల్పోయి విలవిలలాడాయి. ఎన్నో పక్షులు అక్కడికక్కడే చనిపోయాయి కూడా. ఆ మూగజీవుల జీవితాల్లో అంతకు మించిన ప్రళయం మరొకటి ఏముంటుంది? గుండె గోస చెప్పుకునేందుకు నోరు కూడా లేని వాటి వెతలను అద్దం పట్టే వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

 

వీకే పడి గ్రామం..

అది కేరళలోని మలప్పురం జిల్లాలో నేషనల్ హైవే 66 పక్కనే ఉన్న
వీకే పడి గ్రామం.  రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల్లో భాగంగా  రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టును జేసీబీతో కూల్చివేశారు. అయితే ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్లు కట్టుకుని.. గుడ్లు పెట్టి.. పిల్లలను పొదిగాయి. ఒక్క‌సారిగా చెట్టును కూల్చివేయడంతో వందలాది పక్షులు, వాటి పిల్లలు వాటి గూళ్లలో నుంచి  ఎగ‌ర‌లేక‌..నేలకు బలంగా తాకి చనిపోయాయి. కొన్ని పక్షులు ఎగిరి ప్రాణాలు దక్కించుకున్నాయి. ఆ చెట్టు మీదున్న పక్షుల గూళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఆ ప‌క్షులు ఎగ‌ర‌లేక బాధ‌తో త‌ల్లాడిల్లాడం.. చూసిన స్థానికుల హృద‌యం చ‌లించింది.ఈ హృదయవిదారక వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ త‌న‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

కేసు నమోదు ..

అటవీ శాఖ అనుమతి లేకుండా చెట్టును నరికిన కాంట్రాక్టర్‌పై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే చెట్టును తోసేందుకు ఉపయోగించిన జేసీబీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ నగర్ పంచాయతీ అధికారులు కూడా కాంట్రాక్టర్ త‌మ‌కు చెట్టు నరికివేత గురించి  సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేరళ అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్
కూడా స్పందించారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఆ చెట్టును నరికివేయడానికి అటవీ శాఖ అనుమతి ఇవ్వలేదనీ, వారికి అనుమతి ఉన్నప్పటికీ.. చెట్ల‌పై పక్షులు నివసించినప్పుడు వాటిని నరికివేయకూడదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను కుదిపేశాయి. మనుషులు తమ స్వార్థం కోసం మిగతా జీవుల నెలవుల్ని ఎలా ఆక్రమిస్తారంటూ నెటిజెన్లు ప్రశ్నించారు.