Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రమేష్ బిధూరిని అధికారికంగా ఆ పార్టీ ఒకటి, రెండ్రోజుల్లో ప్రకటించనున్నట్టు తనకు తెలిసిందని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటితం కాబోతున్న రమేశ్ బిధూరీకి నా అభినందనలు. అయితే ఆయన ఒక ఎంపీగా ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి. ఢిల్లీ పట్ల ఆయనకున్న విజన్ ఏమిటో వెల్లడించాలి అన్నారు.
బీజేపీ రమేశ్ బిధూరీ పేరును అధికారికంగా ప్రకటించిన తర్వాత ఢిల్లీ ప్రజల ముందు బీజేపీ, ఆప్ సీఎం అభ్యర్థుల మధ్య చర్చ జరగాలి అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో కొత్తగా భారీ సంఖ్యలో ఓటర్లు నమోదు కావడంపై కేజ్రీవాల్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 15, జనవరి 8వ తేదీ మధ్య 15 రోజుల కాలంలో 13,000 కొత్త ఓటర్లు వచ్చి చేశారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి కొత్త ఓటర్లను తెచ్చారని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు బిజేపీ పథకం ప్రకారం ముందుకు వెళ్తోందని ఆరోపించారు.
ఇటీవల ఢిల్లీ సీఎం అతిషి సింగ్ గురించి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ గురించి రమేశ్ బిధూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఓకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడించనున్నారు.