HCA Tickets Issue: హెచ్‌సిఎ తీరుపై ఫ్యాన్స్ ఫైర్

హైదరాబాద్‌ వేదికగా జరిగే భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌ టిక్కెట్ల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 08:34 PM IST

హైదరాబాద్‌ వేదికగా జరిగే భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌ టిక్కెట్ల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌కు టిక్కెట్ల కోసం అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్షంగా మ్యాచ్ చూడాలన్న కోరికతో వేలమంది ఒక్కసారిగా సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌కు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. ఉదయం పది గంటల నుంచి టికెట్ల సేల్‌ మొదలుపెట్టారు. అయితే రాత్రి నుంచి అభిమానులు జింఖాన్‌ గ్రౌండ్స్ బయట క్యూ కట్టారు. దాదాపు పదివేల మంది అభిమానులు ఉదయం నుంచి టికెట్ల కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. ఉదయం పదిన్నరకు కౌంటర్లు ఓపెన్‌ చేసిన నిర్వాహకులు.. ఒక్కసారి 20 మందిని మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు.

టికెట్ల అమ్మకాలు మెల్లగా సాగుతుండడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. గేట్లు పగులగొట్టేందుకు అభిమానులు ప్రయత్నించడంతో అభిమాలనుపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. గేట్లు తెరవడంతో ఒక్కసారిగా దూసుకెళ్లారు. తొక్కిసలాటలో అభిమానులు, పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. పలువురు స్పృహ తప్పి పడిపోయారు. ఈ సమయంలో లేడీ కానిస్టేబుల్‌ నవీన చాకచక్యంగా వ్యవహరించారు. స్పృహ తప్పిపడిపోయిన ఓ మహిళకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సీరియస్ అయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్, అధికారులతో మంత్రి సమావేశమై ఈ ఘటన చర్చించారు. టిక్కెట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు టిక్కెట్ల గోల్‌మాల్‌ వ్యవహారాన్ని అజారుద్దీన్‌ లైట్‌గా తీసుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎదుటే రివర్స్‌ అటాక్ చేశారు. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించడం అంత ఈజీ కాదన్నారు. జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గాయాల పాలైన వారికి హెచ్‌సిఎ అండగా ఉంటుందన్నారు. మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల వివరాలు ప్రభుత్వానికి అందిస్తామని, తప్పులేమైనా ఉంటే చర్యలు తీసుకోవచ్చిన చెప్పారు. కాగా టికెట్ల విక్రమంలో హెచ్‌సీఏ వైఫల్యమే ఈ ఘటనకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 3వేల టికెట్ల కోసం వేలాదిగా అభిమానులు ఎగబడ్డారు. మొదట పేటీఎం ద్వారా టికెట్ల విక్రయమని చెప్పిన హెచ్‌సీఏ తరువాత మాట మార్చి.. ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయమంటూ ప్రచారం చేసింది. ఈ క్రమంలో HCA సభ్యుల మధ్య వివాదాలతో టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొంది. టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించడానికి హెచ్‌సీఏకు వచ్చిన అభ్యంతరం ఏంటని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నించారు.