Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హిసార్ కోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించింది. “ట్రావెల్ విత్ జో” అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ పాక్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.
బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం కొనసాగుతున్న దర్యాప్తుకు అడ్డంకి అవుతుందని పోలీసుల వాదనను సమర్థించింది. దాంతో, కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. తదుపరి విచారణను జూన్ 23కు వాయిదా వేసింది. ఇదివరకు జూన్ 9న కూడా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు, కేసులో రోజురోజుకు వెలుగులోకి వస్తున్న విషయాలపై తీవ్ర దృష్టి సారిస్తోంది. యూట్యూబర్ మల్హోత్రా ఇప్పటివరకు మూడుసార్లు పాకిస్తాన్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు, ఆమె పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న డానిష్ అనే ఐఎస్ఐ ఏజెంట్‌తో నవంబర్ 2023 నుంచి సంపర్కంలో ఉందని విచారణలో వెల్లడైంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఆమెను విలువైన ఆస్తిగా భావించి, అక్కడ ఆమె పర్యటనలో వీఐపీ ప్రోటోకాల్‌తో గన్ మెన్ల భద్రత కూడా కల్పించినట్టు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో మే 16న న్యూ అగర్సేన్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారిక రహస్యాల చట్టం (Official Secrets Act)తో పాటు భారతీయ న్యాయసంహిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ పర్యటనలు చేస్తూ వీడియోలు రూపొందించే మల్హోత్రా ఇంతటి కుట్రలో భాగమయ్యిందన్నది ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.
South Korea : ఉత్తర కొరియా సరిహద్దుల్లో మైకుల వినియోగం నిలిపివేత : సియోల్