Harish Rao: ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, రైతుల సంక్షేమం పట్ల లేదు

  • Written By:
  • Updated On - July 4, 2024 / 09:57 PM IST

Harish Rao: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విరుచుకుపడ్డారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమని,ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చిందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు.