Harish Rao : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా వరంగల్ వేదికగా విజయోత్సవాలను కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తుంది. అయితే ఈ విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మంగళవారం ఎక్స్ వేదికగా మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండని అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్‌గా మోసం చేసిందని, వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లారని హరీశ్ రావు విమర్శించారు.
ఏడాది క్రితం ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు అతీగతీ లేదన్నారు. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి ఏర్పడిందన్నారు. వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పాటలు పాడుకుంటున్న పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాకవి కాళోజీ చెప్పినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారని ఆరోపించారు. రైతులు దారుణంగా మోసపోయారని పేర్కొన్నారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.
ఇకపోతే.. కాంగ్రెస్ పాలనలో పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు.. స్కాలర్ షిప్‌ల కోసం విద్యార్థులు.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు.. రుణమాఫీ, రైతుబంధు కోసం రైతులు.. జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు.. డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిధులు విడుదల చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బంది.. ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు.. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు.. సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు.. పింఛన్లు పెంచాలని వృద్ధులు ఇలా అందరినీ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ ఫుల్‌గా రోడ్ల మీదికి తెచ్చాడని హరీశ్ రావు అన్నారు. ఇకనైనా గోబెల్స్ ప్రచారాలు పక్కన బెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టాలని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుకు వరంగల్ వేదికగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Mumtaz Hotel in Tirupati : ముంతాజ్ హోటల్‌పై (TTD) బోర్డు కీలక నిర్ణయం..