హనుమన్ చాలీసా వివాదం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని..లేదంటే తామే ముఖ్యమంత్రి నివాసం ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు ప్రయత్నించారు. తాజాగా ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిని ఖార్ర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు మండిపడ్డారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని…ముఖ్యమంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతామని మాత్రమే చెబుతున్నామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా సీఎం ఇంటి ముందు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. మొత్తం నవనీత్ కౌర్ ప్రకటన…అరెస్టు చర్యలతో ముంబైలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.