Gujarat Titans Tops Table: మళ్ళీ టాప్‌ లేపిన గుజరాత్‌

ఐపీఎల్ 15వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపుతోంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు తన కంటే బలంగా ఉన్న జట్లపై ఇప్పటికే విజయాలు సాధించింది.

  • Written By:
  • Updated On - April 23, 2022 / 11:06 PM IST

ఐపీఎల్ 15వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపుతోంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు తన కంటే బలంగా ఉన్న జట్లపై ఇప్పటికే విజయాలు సాధించింది. తాజాగా ఉత్కంఠపోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. తక్కువ స్కోరే చేసినా సూపర్ బౌలింగ్‌తో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. శుభమన్‌ గిల్ 7 పరుగులకే ఔటయ్యాడు.అయితే మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహాతో కలిసి కెప్టెన్ హార్థిక్ పాండ్యా ధాటిగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. సాహా 25 రన్స్‌కు ఔటైనా…పాండ్యా హాఫ్ సెంచరీతో రాణించాడు. తర్వాత మిల్లర్ కూడా ధాటిగా ఆడినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 27 పరుగులకు మిల్లర్ ఔటైన తర్వాత గుజరాత్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. దీంతో భారీస్కోరు చేస్తుందనుకున్న ఆ జట్టు 156 పరుగులకే పరిమితమైంది. పాండ్యా 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ ఒక ఓవర్లో 5 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మరో పేసర్ సౌథీ 3 వికెట్లు తీసాడు.

టార్గెట్ పెద్దది కాకపోవడంతో కోల్ కతా సునాయాసంగా గెలుస్తుందని అంతా భావించారు. అయితే గుజరాత్ టైటాన్స్ బౌలర్లు తొలి ఓవర్ నుంచే అదరగొట్టారు. దీంతో కోల్ కతా కేవలం 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. శుభ్ మన్ గిల్ 4 , నరైన్ 5 , శ్రేయాస్ అయ్యర్ 12 , నితీశ్ రాణా 2 పరుగులకే ఔటయ్యారు. తర్వాత రింకూ సింగ్ , వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అయితే చివర్లో ఆండ్రూ రస్సెల్ భారీ షాట్లతో రెచ్చిపోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రస్సెల్ క్రీజులో ఉన్నంతసేపూ కోల్ కతానే గెలుస్తుందనిపించింది. చివరి ఓవర్లో విజయం కోసం 18 పరుగులు చేయాల్సి ఉండగా.. రెండో బంతికి రస్సెల్ ఔటవడంతో కోల్ కతా ఓటమి ఖాయమైంది. తర్వాత టెయిలెండర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు. రస్సెల్ కేవలం 25 బంతుల్లోనే 6 సిక్సర్లతో 48 పరుగులు చేసినా కీలక సమయంలో ఔటవడంతో గుజరాత్ టైటాన్స్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో షమీ 2, యశ్ దయాల్ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ మళ్ళీ టాప్ ప్లేస్ కు దూసుకెళ్ళింది. లీగ్ లో ఆ జట్టుకు ఇది ఆరో విజయం.