Site icon HashtagU Telugu

GT vs LSG Highlights: హోంగ్రౌండ్‌లో దుమ్మురేపిన గుజరాత్‌.. లక్నోపై ఘనవిజయం

GT vs LSG Highlights

Whatsapp Image 2023 05 07 At 9.47.37 Pm

GT vs LSG Highlights: అన్నదమ్ముల పోరులో తమ్ముడిదే పైచేయిగా నిలిచింది. హోంగ్రౌండ్‌లో మరోసారి దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్‌ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగానే ఆడుతున్న గుజరాత్‌కు లక్నో పెద్దగా పోటీనివ్వలేకపోయింది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సహా అదరగొడితే… బౌలింగ్‌లో మోహిత్‌శర్మ మెరిసాడు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ల ఆటే హైలైట్‌.. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కొడితే సిక్సర్..లేకుంటే ఫోర్ అన్న తరహాలో వీరి బ్యాటింగ్ సాగింది. లక్నో బౌలర్లలో ఏ ఒక్కరినీ వదలకుండా ఉతికారేశారు.వీరి జోరుకు గుజరాత్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీల తర్వాత మరింత దూకుడుగా ఆడిన సాహా, గిల్ తొలి వికెట్‌కు 12.1 ఓవర్లలో 142 పరుగులు జోడించారు. సాహా కేవలం 43 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేశారు. తర్వాత పాండ్యా 25 , మిల్లర్ 21 చేయగా.. గిల్ చివరి వరకూ దూకుడుగా ఆడి నాటౌట్‌గా నిలిచాడు. మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ సెంచరీ చేస్తాడనుకున్నప్పటకీ.. చివర్లో ఎక్కువ స్ట్రైకింగ్ రాకపోవడంతో కుదర్లేదు. గిల్ 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 94 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 227 పరుగులు చేసింది. లక్నో ఏకంగా 8 బౌలర్లను ఉపయోగించినా గుజరాత్‌ను కట్టడి చేయలేకపోయింది.

కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఓపెనర్లు డికాక్, మేయర్స్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. దూకుడుగా ఆడుతూ స్కోర్‌ బోర్డ్ పరిగెత్తించారు. వీరిద్దరి జోరుతో లక్నో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 72 పరుగులు చేసింది. మేయర్స్ 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 , డికాక్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశారు. అయితే మేయర్స్ ఔటయ్యాక లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. మిగిలిన బ్యాటర్లు కూడా అనుకున్నంత వేగంగా ఆడలేకపోవడంతో ఓటమి ఖాయమైపోయింది. దీపక్ హుడా 11, స్టోయినిస్ 4 , నికోలస్ పూరన్ 3 నిరాశ పరిచారు. ఆయూశ్ బదౌనీ 21 పరుగులు చేయగా..మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 4 వికెట్లు పడగొట్టగా… షమి, రషీద్‌ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు. కాగా లక్నో 11 మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. అటు లక్నో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Read More: Navdeep : నన్ను గే అన్నారు.. నవదీప్ సంచలన వ్యాఖ్యలు..