Site icon HashtagU Telugu

Jignesh Mevani: బెయిల్ వ‌చ్చిన గంట‌లోనే ఎమ్మెల్యే మ‌ళ్లీ అరెస్ట్‌.. ఎందుకంటే..

Jignesh

Jignesh

Update : 8:30PM:

న‌రేంద్ర‌మోడీపై ట్వీట్లు పెట్టిన కేసులో బెయిల్ పొందిన‌ గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ను పోలీసులు మ‌ళ్లీ అరెస్ట్ చేశారు. బెయిల్ వ‌చ్చిన గంట‌లోపే మ‌రో కేసులో అరెస్ట‌య్యారు ఎమ్మెల్యే. గ‌తంలో ఓ మ‌హిళా పోలీసుతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారన్న కేసులో ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన‌ట్టు చెబుతున్నారు.

——

వాస్త‌వానికి  గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పరువు నష్టం కలిగించే ట్వీట్ చేశార‌ని ఆయ‌నపై కేసు న‌మోదైంది. గత వారం అరెస్టయిన గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాంలోని కోక్రాజార్ జిల్లాలోని స్థానిక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. మేవానీ త‌రుపున న్యాయ‌వాది అంగ్షుమాన్ బోరా మాట్లాడుతూ.. కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. తాము ఫార్మాలిటీలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. అయితే పొరుగున ఉన్న బార్‌పేట జిల్లాలో ఎమ్మెల్యేపై మరో కేసు నమోదైందని, మళ్లీ అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేశారు. బార్‌పేటలో మరో కేసు నమోదైందని తమకు సమాచారం ఉందని మేవానీకి సహకరిస్తున్న బృందంలో భాగమైన కాంగ్రెస్ లీగల్ సెల్ హెడ్ మనోజ్ భగవతి తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ విడుదలయ్యే అవకాశం లేదని భగవతి అన్నారు. దీనిపై మాట్లాడేందుకు బార్‌పేట‌ ఎస్పీ అమితాబ్ సిన్హా పదే పదే ఫోన్ చేసినా స్పందించలేదని ఆయ‌న తెలిపారు.

మేవానీని మూడు రోజుల పోలీసు రిమాండ్‌ను పూర్తి చేసిన తర్వాత ఆదివారం కోక్రాజార్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు అతని బెయిల్ పిటిషన్‌పై తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. మేవానీని ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆదివారం విచారణ సందర్భంగా అస్సాం పోలీసులు ఎమ్మెల్యేను 10 రోజుల కస్టడీకి కోరినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. శాసన సభ్యునిపై “ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు” లేవని మేవాని త‌రుపున న్యాయ‌వాది అంగ్షుమాన్ బోరా వాదించారు. మోడీ “గాడ్సేను దేవుడిగా భావించారు” అని ఎమ్మెల్యే ట్వీట్ చేశారని ఈశాన్య రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకుడు చేసిన ఫిర్యాదు మేరకు గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నుండి అస్సాం పోలీసులు మేవానీని అరెస్టు చేశారు.