Farmers: అడుగంటిన భూగర్భజలాలు.. ఎండుతున్న పంటలు, దిక్కుతోచని స్థితిలో రైతులు

  • Written By:
  • Updated On - March 12, 2024 / 11:16 PM IST

Farmers: తెలంగాణ రాష్ట్రమంతా భూగర్భ జలాలు ఎండిపోయాయి. దీంతో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ, ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందుతుందని ఆశించిన 12 గ్రామాల రైతుల వరి పంటలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సుమారు 10 వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది. ఇటీవలే అధికారులను కలిసిన రైతులు ఎస్సారెస్సీ డీబీఎం 22ఏ, 22బీ ద్వారా సాగునీరు విడుదల చేయాలని కోరినా ఫలితం లేదు.

కొందరు బావుల్లో పూడిక తీయించే పనుల్లో నిమగ్నం కాగా, మరికొందరు బోర్లు వేయించేందుకు అప్పులు చేస్తున్నారు. యాసంగి ఆరంభంలో తెగుళ్లు పంటలపై దాడి చేయగా ఇప్పుడు పొట్ట దశలో ఉన్న పంటలకు నీరందక ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.దాదాపు ఐదేళ్లుగా బోర్లకు గిరాకీ తగ్గింది. మంచి వర్షాలు కురవడంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతలతో చెరువలను ముందే నింపడంతో సాగునీటితోపాటు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి.

దీంతో బోర్లు, బావులు తవ్వకాలు ఆగిపోయాయి. బోరు యంత్రాలు పట్టణాల్లో ఇళ్లకు బోర్లు వేసే పనులు మాత్రమే చేశాయి. అయితే ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేశాయి. ఆగస్టు తర్వాత వానలు కురవలేదు. దీంతో చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీరు ఇంకిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు మళ్లీ బోరు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు.