రంగారెడ్డి జిల్లా, బడంగ్ పేట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీదుర్గ కాలనీకి చెందిన విశాల్ (25) అనే యువకుడు పెళ్లైన రెండు రోజులకే గుండెపోటు(Heart Attack)తో మరణించాడు. ఈ ఘటన స్థానికంగా మరియు వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈనెల 7న విశాల్ కు వివాహం జరిగింది. పెళ్లి వేడుకల సందడి ఇంకా ముగియకముందే, ఈ అనూహ్య ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
పెళ్లి వేడుకలు పూర్తి చేసుకుని, కొత్తగా పెళ్లైన జంట తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలోనే వరుడు విశాల్కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, విశాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
CM Revanth Reddy : హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన
వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు విశాల్ను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే విశాల్ తుదిశ్వాస విడిచాడు. పెళ్లి వేడుకలతో నిండిన ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. పెళ్లింట సంతోషం ఇంకా వెళ్ళకముందే, ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది.
ఈ ఘటనతో వధువు కుటుంబం, విశాల్ కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన యువకుడు అకస్మాత్తుగా మరణించడంతో బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాల్ మృతి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమై, యువత గుండెపోటు సమస్యలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.