Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్ కు బదులు హరీశ్ రావు హాజరయ్యారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…శాసనసభా వ్యవహారాల మంత్రికి సమాచారం కూడా ఇచ్చారు. అయితే బీఏసీ సమావేశానికి హరీశ్ రావు రావడాన్ని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. కేసీఆర్ కు బదులు హరీశ్ రావు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్ రావు సమావేశంలో పాల్గొనకుండానే బయటకు వచ్చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తామని, అయితే అది పేలవంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ మిగిలిందన్న ఆయన…వృద్దులు, వికలాంగులకు, ఆసరా పింఛన్ దారులకు, మహిళలకు…గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించిందన్నారు. పంటకు బోనస్ గురించి మాట్లాడక పోవడం వల్ల రైతాంగానికి నిరాశే మిగిలిందన్న ఆయన…ప్రజలకు ఏలాంటి విశ్వాసం కల్పించలేదన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి గురించి మాట్లాడలేదని…మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదని హరీశ్ రావు విమర్శించారు.
నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదన్న ఆయన…ప్రజా వాణి తుస్సుమందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…ప్రతి రోజూ వినతులు స్వీకరిస్తారని చెప్పారని…మంత్రులు, ఐఎఎస్ లు కూడా లేరని… చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ చేత చెప్పించారన్న హరీశ్ రావు…ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 ఉన్నాయని… రెండు అమలు చేసి మొత్తం చేసినట్లు చెబుతున్నారని విమర్శించారు.