Govt Job: ప్రభుత్వ ఉద్యోగం అంటే ట్వీట్ చేయడం కాదు.. అధికారిపై సీఎం సీరియస్!

సోషల్ మీడియా వాడకం జనాల్లో బాగా పెరుగుతోంది. ఏం జరిగినా సరే వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రజలకు అలవాటుగా మారింది.

  • Written By:
  • Publish Date - February 10, 2023 / 08:43 PM IST

Govt Job: సోషల్ మీడియా వాడకం జనాల్లో బాగా పెరుగుతోంది. ఏం జరిగినా సరే వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రజలకు అలవాటుగా మారింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్న ఓ అధికారి మీద సీఎం మండిపడ్డారు. ట్వీట్లు చేయడం మీ పని కాదు అని సీరియస్ అవడంతో పాటు సదరు అధికారి మీద విచారణకు ఆదేశించాడు ఆ సీఎం. ఇంతకీ అంతలా ఏం జరిగిందో తెలుసుకుందాం.

బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న ఓ అధికారి తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ పరిధిలో ఉద్యోగం చేస్తున్న అధికారి బాధ్యత ట్వీట్లు చేయడం కాదు. ఇది చాలా దారుణమైన విషయం. అధికారులకు ఏవైనా సమస్యలుంటే, నిబంధనల ప్రకారం మీ పై అధికారులకు లేదా ప్రభుత్వానికి తెలియజేయాలి. అదే చట్టం. అంతే తప్ప అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేయరాదు’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

ఇలాంటి పని చేసిన విచారణకు ఆదేశించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. సదరు అధికారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ అధికారి మరో అధికారి మీద సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేయడంతో వివాదం మొదలైంది. బిహార్ పోలీసుశాఖలో హోంగార్డ్స్, అగ్నిమాపకశాఖ ఐజీగా వికాస్ వైభవ్ అనే ఐపీఎస్ అధికారి అక్టోబర్ లో నియమితులయ్యారు.

తన విధులకు డీజీ శోభా అహోట్కర్ ఆటంకం కలిగిస్తున్నారని, అకారణంగా తనను దుర్భాషలాడుతున్నారని కొద్దిరోజుల క్రితం వికాస్ ట్వీట్ చేశారు. ఇది ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీయగా.. సీఎం దృష్టికి ఈ విషయం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన నితీశ్ కుమార్.. సదరు అధికారి మీద విచారణకు ఆదేశించడంతో పాటు ఘాటుగా స్పందించారు.