హైదరాబాద్‌లోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. కొత్త పేట పండ్ల మార్కెట్‌ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొందరు మార్కెట్ తరలింపును అడ్డుకుంటున్నారు. దీంతో అర్థరాత్రి నుంచి కొత్త పేట పండ్ల మార్కెట్‌ను కూల్చివేయాలని రాగా, అక్కడి వ్యాపారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ అధికారులు, వ్యాపారుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
ప్రభుత్వం గడ్డిఅన్నారం వ్యవసాయ, పండ్ల మర్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్ పార్కులోకి తరలించిన సంగతి తెలిసిందే. ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని చూస్తుంది. అయితే ఫ్రూట్ మార్కెట్ తరలింపుపై కొందరు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. మార్కెట్‌లో ఉన్న ఫర్నీచర్, ఏసీ సామగ్రి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో వసతులు లేవని, ప్రభుత్వం హడావుడి చేస్తుందని కోర్టులో పిటిషన్ వేశారు. గత కొంతకాలంగా ఈ వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేత మొదలు పెట్టడంతో, వేలాది మంది వ్యాపారులు, కూలీలు రోడ్డున పడ్డారు.
