Site icon HashtagU Telugu

Emergency In Srilanka: శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించిన గొటబాయ ప్రభుత్వం.. శుక్రవారం అర్థరాత్రి నుంచే అమలు

Sri Lanka Election Fever

Sri Lanka Election Fever

ప్రపంచం అనుకున్నట్టే జరిగింది. శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించింది అక్కడి ప్రభుత్వం. ఆర్థికంగా పతనావస్థకు చేరడంతో విధిలేని స్థితిలో అత్యయిక పరిస్థితికి సిగ్నల్ ఇచ్చింది. అది కూడా శుక్రవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి తీసుకువచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తీసుకున్న ఈ నిర్ణయంతో శ్రీలంక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే నిత్యావసర సేవలను అందించాలంటే ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని అందుకే ఎమర్జెన్సీని విధించామంది ప్రభుత్వం.

శ్రీలంక ఆర్థిక దుస్థితికి ఆ దేశ అధ్యక్షుడు గొటబాయతోపాటు ప్రధాని మహిందలే కారణమంటూ దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సమ్మెలు కూడా జరుగుతున్నాయి. అందుకే వీటిని సమర్థంగా అడ్డుకోవడానికి ఎమర్జెన్సీ అస్త్రాన్ని ప్రయోగించింది ప్రభుత్వం. దేశ ప్రధాని మహింద రాజపక్సకు సొంత క్యాబినెట్ నుంచి ప్రతికూలత ఎదురైంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ఆయన
ప్రధాని పదవికి రాజీనామా చేయాలని.. ఆయన సహచర మంత్రులే కోరారు. కానీ ఆయన మాత్రం దానికి ఒప్పుకోలేదు.

ఎమర్జెన్సీని విధించడం వల్ల ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు వస్తాయి. అంటే దేశంలో ఎవరినైనా సరే.. ఏ కారణం లేకుండానే పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. కానీ ఇది ప్రజల హక్కులను కాలరాస్తుంద్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అక్కడ రెండోసారి ఎమర్జెన్సీని విధించారు. అయినా సరే.. శ్రీలంక విద్యార్థులు మాత్రం.. అధ్యక్షుడు గొటబాయ రాజీనామాకు చేస్తున్న డిమాండ్ ను మాత్రం
ఆపలేదు.

శ్రీలంకలో ఇప్పుడు విద్యార్థి సంఘాలు కీలకంగా మారాయి. కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు అవి కూడా మద్దతిచ్చాయి. ఈనెల 17న ప్రారంభమయ్యే జాతీయ అసెంబ్లీ సమావేశాలకు ముందే గొటబాయ రాజీనామా చేయాలని.. లేకపోతే పార్లమెంట్ ను ముట్టడిస్తామని ఇప్పటికే హెచ్చరించాయి.