CM Revanth Reddy : తెలంగాణ శాసనసభలో శుక్రవారం రోజు దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన గోపీనాథ్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గోపీనాథ్‌తో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా మా పార్టీలు వేరు అయినా, గోపీనాథ్ నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన వ్యక్తిత్వం గొప్పది. చూడటానికి క్లాస్ లీడర్ లా కనిపించేవారు కానీ, వాస్తవానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం మాస్ నేతగా నిలబెట్టింది అని పేర్కొన్నారు.
Read Also: Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు!
మూడు టర్ములు ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్‌కు ఉన్న ప్రజాధారణ, ఆయన నిబద్ధతను సీఎం గుర్తు చేశారు. “ఆయన మరణం కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అన్నారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవనాన్ని వివరించిన సీఎం, ఆయన విద్యార్థి దశ నుంచే సామాజిక చైతన్యంతో కూడిన నాయకుడిగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన గోపీనాథ్, ఎన్టీఆర్‌తో సన్నిహితంగా పని చేశారని తెలిపారు. 1985 నుంచి 1992 మధ్య కాలంలో తెలుగు యువత అధ్యక్షుడిగా, హుడా డైరెక్టర్‌గా, జిల్లా వినియోగదారుల ఫోరంలో సభ్యునిగా పలు బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. గోపీనాథ్ సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా రేవంత్ వివరించారు. ఆయన నిర్మించిన ‘పాతబస్తీ’, ‘రవన్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘నా స్టైలే వేరు’ వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందినవని అన్నారు. రాజకీయాలు, సినిమా, సామాజిక సేవ అన్ని రంగాల్లో ఆయన తనదైన సత్తా చాటారని గుర్తు చేశారు.
ఇక శాసనమండలిలో కూడా మాగంటి గోపీనాథ్ మృతికి సంబంధించి ప్రత్యేక సంతాప తీర్మానం ఆమోదమైంది. మంత్రి శ్రీధర్ బాబు సభలో మాట్లాడుతూ..మాగంటి గోపీనాథ్ ఒక సత్పురుషుడు, ప్రజల కోసం జీవితాంతం పని చేసిన నాయకుడు అని కొనియాడారు. అలాగే, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతిపట్ల కూడా సంతాప తీర్మానం ఆమోదించి నివాళులు అర్పించారు. వీటితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలిపై చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా, ప్రజలకు సేవలందించిన గొప్ప నాయకుడిగా మాగంటి గోపీనాథ్ స్మృతిలో నిలిచిపోయారు. ఆయన జీవితం, సేవలు, సమర్పణ రాజకీయాల్లో ఆశయం కోసం నిరంతరం పనిచేసే నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.