Site icon HashtagU Telugu

Google: సీసీఐకి రూ.1,337.76 కోట్ల పెనాల్టీ చెల్లించిన Google

Google Has Paid A Penalty Of Rs 1,337.76 Crore To Cci

Google Has Paid A Penalty Of Rs 1,337.76 Crore To Cci

Google : ప్లే స్టోర్‌ విధానాల్లో పోటీతత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ల తయారీ కంపెనీలకు పరిమితులు విధిస్తోందన్న కారణంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన రూ.1,337.76 కోట్ల పెనాల్టీని టెక్ దిగ్గజం గూగుల్ చెల్లించింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) 30 రోజులలోగా జరిమానాను చెల్లించాలని ఆదేశించడంతో.. ఆ గడువులోగా మొత్తం ఫైన్ ను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో గూగుల్ జమ చేసింది.

ఆండ్రాయిడ్‌ మొబైళ్ల విభాగంలో గూగుల్‌ (Google) గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందంటూ 2022 అక్టోబరు 20న సీసీఐ సుమారు రూ.1337.76 కోట్ల జరిమానా వేసింది. వారం కూడా తిరగకముందే, గూగుల్‌ ప్లే స్టోర్‌ విధానాల్లో పోటీతత్వానికి వ్యతిరేకమైన వాటిని అనుసరిస్తోందంటూ మరో రూ.936.44 కోట్ల అపరాధ రుసుము వడ్డించింది. తక్షణం తీరును మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే గూగుల్‌కు ఈ స్థాయిలో భారత్‌లో ఎదురుదెబ్బ తగలడం ఇదే తొలిసారి. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌లు తయారు చేసే కంపెనీలకు గూగుల్‌ పరిమితులు విధిస్తోందన్న కారణంతో గతంలో యూరప్‌ ప్రభుత్వం గూగుల్‌ పై దాదాపు రూ. 3 వేల కోట్ల జరిమానా వేసింది. దీనిపై కోర్టుకెళ్లినప్పటికీ గూగుల్‌కు నిరాశే ఎదురైంది. 2018 నాటి తీర్పును ఇటీవలే యూరోపియన్‌ కోర్టు సమర్థించింది.

కొద్ది రోజులకే భారత్‌లో సైతం అలాంటి అనుభవమే గూగుల్‌కు ఎదురవ్వడం గమనార్హం. అయితే గూగుల్ ఈ న్యాయ వివాదాన్ని సాగదీయకుండా భారత్ లో మొత్తం ఫైన్ చెల్లించడం గమనార్హం. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి సీసీఐ యొక్క ఆదేశాలను పాటిస్తున్నామని తెలుపుతూ 2023 సంవత్సరం ప్రారంభంలో Google ఒక ప్రకటన విడుదల చేసింది. “Android మరియు గూగుల్ Play విభాగాల్లో సీసీఐ తాజా ఆదేశాల ప్రకారం భారతదేశ కస్టమర్ల కోసం గణనీయమైన మార్పులు చేయవలసి ఉంటుంది. మేము సీసీఐ ఆదేశాలను పాటిస్తాము. అనుకూలత లేని లేదా ఫోర్క్ చేసిన వేరియంట్‌లను రూపొందించడానికిగానూ Android, గూగుల్ ప్లే స్టోర్ కస్టమర్ల కోసం కొన్ని మార్పులను ఆయా సాఫ్ట్ వేర్ లలో అప్‌డేట్ చేస్తున్నాము” అని వెల్లడించింది.

వినియోగదారులు గూగుల్ ప్లే లో కొనుగోళ్లు చేసే క్రమంలో బిల్లింగ్ సెక్షన్ లో Google Play బిల్లింగ్ సిస్టమ్‌తో పాటు ఇతరత్రా వివిధ చెల్లింపు ఆప్షన్లను కూడా అందించడానికి డెవలపర్‌లను మేం ఇకపై అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే తమ కంపెనీ చేసిన క్లెయిమ్‌లకు సంబంధించిన సాక్ష్యాలను సీసీఐ పరిశీలించలేదని.. యూరోపియన్ కోర్టు ఆర్డర్‌లోని భాగాలను కాపీ పేస్ట్ చేసిందని Google వ్యాఖ్యానించడం గమనార్హం.

Also Read:  Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో ప్రతి నెలా లక్ష రూపాయల వరకు సంపాదన.. మీరు చేయాల్సిందే ఇదే..!