ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసే విధంగా గూగుల్ వ్యవహరించడంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) సీరియస్ అయింది. ఈ విషయంలో గూగుల్‌కు రూ. 936.44 కోట్లు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు టెక్ దిగ్గజం గూగుల్ కు మంగళవారం మరో జరిమానా విధించింది. తాజా ఆర్డర్‌లో రూ. 936.44 కోట్లు పెనాల్టీగా చెల్లించాలని కంపెనీని కోరింది. వారంలోపే రెగ్యులేటర్ విధించిన రెండో జరిమానా ఇది.
ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాల పర్యావరణ వ్యవస్థలో బహుళ మార్కెట్‌లలో దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు CCI అక్టోబర్ 20న Googleపై రూ. 1,337.76 కోట్ల పెనాల్టీని విధించిన విషయం మనకు తెలిసిందే. అన్యాయమైన వ్యాపార పద్ధతులను నిలిపివేయాలని.. మానుకోవాలని Googleని CCI ఆదేశించినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. నిర్దిష్ట సమయంలోగా తన ప్రవర్తనను మార్చుకోవాలని సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ ను CCI ఆదేశించింది.
యాప్స్, ప్రోగ్రామ్‌లను అమలు చేయడానికి స్మార్ట్ మొబైల్ పరికరాలకు ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అవసరం. ఆండ్రాయిడ్ అనేది 2005లో గూగుల్ కొనుగోలు చేసిన అటువంటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్య కోసం గూగుల్ అత్యాశకు పోతోంది. యాప్ స్టోర్ మార్కెట్‌లో అన్యాయమైన విధానాలను అవలంబిస్తోంది. పోటీ కంపెనీ వృద్ధి చెందకుండా అవలంబిస్తున్న విధానాలు పోటీ చట్టానికి విరుద్ధం.