Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

  • Written By:
  • Updated On - March 9, 2024 / 02:45 PM IST

Indiramma Houses: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చింది. అందులో ప్రధానమైంది ఇందిరమ్మ ఇళ్లు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు ఇవే

లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం 4 దశల్లో ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
☛ బేస్ మెంట్ స్థాయిలో రూ.లక్ష
☛ రూఫ్ (పైకప్పు) స్థాయిలో రూ.లక్ష
☛ పైకప్పు నిర్మాణం తర్వాత రూ.2 లక్షలు
☛ ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష అందించనున్నారు. ప్రతి దశలోనూ అధికారులు పరిశీలన అనంతరం డబ్బు మంజురు చేస్తారు.
వీరే అర్హులు
☛ దారిద్ర్య రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న వారు, ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది.
☛ లబ్ధిదారునికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి.
☛ గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి
☛ గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా ఈ పథకానికి అర్హులు.
☛ అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమైనా, ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావొచ్చు
☛ ఒంటరి, వితంతు (విడోవర్) మహిళలూ అర్హులే.
ఇళ్ల మంజూరు ఇలా
☛ ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరు మీదే ఇస్తారు.
☛ గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
☛ ఆ జిల్లా ఇంఛార్జీ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు.
☛ లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించాకే సమీక్షించి ఖరారు చేస్తారు.
☛ జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తారు.
☛ 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం సెపరేట్ గా ఉండాలి. ఆర్ సీసీ రూఫ్ తో ఇంటిని నిర్మించాలి.
☛ లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సభల్లో ప్రదర్శిస్తారు.
ఏటా 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు కేటాయిస్తుంది. మిగిలిన 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించింది.