Site icon HashtagU Telugu

Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్

Ipl Vivo

Ipl Vivo

ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు జోష్ పెంచే వార్త. ఆ జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్ళు సీజన్ తొలి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉండనున్నారు. నిజానికి ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్తుండడంతో ఈ సారి ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు పలువురు స్టార్ ప్లేయర్స్ దూరమవుతున్నారు. అయితే ముంబై ఫ్రాంచైజీకు మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టుకు ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ క్రికెట్ బోర్డుతో ఒప్పందాలు కలిగి లేరు. ముంబై జట్టు వేలంలో డానియల్ సామ్స్ , మెరిడేత్ , టీమ్ డేవిడ్ లను కొనుగోలు చేసింది. ఈ ముగ్గురికీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్ లేకపోవడంతో నేరుగా ఐపీఎల్ లో చేరనున్నారు.

పాక్ పర్యటనకు వెళ్లని ఆటగాళ్ళు ఏప్రిల్ 6 వరకు ఐపీఎల్‌లో పాల్గొనవద్దని తమ ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది. దీంతో ఫ్రాంచైజీలన్నీ ఢీలా పడ్డాయి. క్రికెట్ ఆస్ట్రేలియా తన కాంట్రాక్ట్ ఆటగాళ్లందరికీ ఈ ఆర్డర్‌ను జారీ చేసింది. ఈ ఆటగాళ్లలో పాట్ కమ్మిన్స్, డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. పాక్ లో భద్రత పై ఆందోళనతో కొందరు టూర్ కు దూరమవగా…అసలు కారణం మాత్రం ఐపీఎల్ అనేది పలువురి అభిప్రాయం.

దీంతో టూర్ ముగిసే వరకూ కాంట్రాక్ట్ ప్లేయర్స్ ఎవ్వరూ కూడా ఐపీఎల్ కు వెళ్ళొద్దని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆసీస్ బోర్డు పై ఫ్రాంచైజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టులో భాగమైతే అది వేరే విషయమనీ , వారు పాకిస్తాన్ సిరీస్‌లో ఆడనప్పుడు ఆపడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై జోక్యం చేసుకోవాలని బీసీసీఐను కోరగా..బోర్డు రంగంలోకి దిగింది.