Site icon HashtagU Telugu

Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ సేవలు ప్రారంభం

Medaram Jatara 2024

Medaram Jatara 2024

Medaram: సమ్మక్క సారక్కల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడాన్ని భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతరకు వెళ్ళలేని భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారి గద్దెల వద్ద సమర్పించే సేవలను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సురేఖ ప్రారంభించారు. తన మనవడు కొండా మురళీకృష్ణ పేరును మీ సేవ వెబ్సైట్ లో నమోదు చేసి, బరువు ప్రకారం డబ్బులు చెల్లించి అమ్మవారి గద్దెల వద్ద నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సౌకర్యాన్ని మంత్రి సురేఖ పొందారు.

వివిధ కారణాలతో సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోలేని భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఐటి శాఖ సహకారంతో దేవాదాయ శాఖ అమలు చేస్తున్న ఈ సేవలు నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మీ సేవ (ఆన్లైన్, ఆఫ్ లైన్), టి యాప్ ఫోలియో (ఆన్లైన్), పోస్టల్ డిపార్ట్మెంట్ల (ఆఫ్ లైన్) ద్వారా ఎవరి పేరు మీదైతే బంగారం సమర్పించాలనుకుంటున్నారో వారి బరువును అనుసరించి డబ్బులు చెల్లించి ఈ సేవలను బుక్ చేసుకునే వెసులుబాటును దేవాదాయ శాఖ అందిస్తున్నది. రాష్ట్రంలోని దాదాపు 5 వేల మీ సేవా సెంటర్లు, దేశంలోని దాదాపు 1.5 లక్షల పోస్టల్ కేంద్రాలు (తెలంగాణలో 6 వేల కేంద్రాలు) ఈ సేవలను అందిస్తాయి. దేవాదాయ శాఖ సంవత్సరం పొడవునా బంగారం సమర్పణ సేవలను అందిస్తుంది.

బంగారం సమర్పణతో పాటు, అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు కూడా పోస్టల్ డిపార్ట్ మెంట్, టి యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా డబ్బులు చెల్లించినట్లైతే, పోస్టల్ డిపార్ట్ మెంట్ కొరియర్ ద్వారా వారికి ప్రసాదాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పలువురు దేవాదాయ శాఖ అధికారులు, పోస్టల్ డిపార్ట్ మెంట్, మీ సేవ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version