Site icon HashtagU Telugu

AP Gold Seized: అక్రమంగా బంగారం తరలింపు.. పట్టుబడిన ఏపీ ఉన్నతాధికారి భార్య!

vijayawada airport

vijayawada airport

ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సీఈవో రేగుళ్ల మల్లికార్జునరావు భార్య నీరజారాణి విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులకు పట్టుబడ్డారు. గురువారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరజ వద్ద బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరువాతి విచారణ కోసం కస్టమ్స్‌కు అప్పగించారు. గురువారం సాయంత్రమే ఈ ఘటన జరిగినప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఈ విషయం బయటకు రాలేదు.

షార్జా నుంచి 38 మంది ప్రయాణికులతో ఐఎక్స్‌ 536 ఎయిర్‌ ఇండియా విమానం గురువారం సాయంత్రం విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో డిఆర్‌ఐ అధికారుల బృందం హైదరాబాద్‌ నుంచి ముందుగానే విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది. షార్జా నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా … నీరజారాణి వద్ద కిలో బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు. దుబాయ్ లో ఆమె బంగారు ఆభరణాల దుకాణాన్ని నిర్వహిస్తుంటారు.