CM Revanth: రేవంత్ తో గోద్రెజ్ కంపెనీ ప్రతినిధుల భేటీ, మరిన్ని పెట్టుబడులు

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 05:06 PM IST

CM Revanth: గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో నేడు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం సింగ్ యాదవ్, ఇతర కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు.

గోద్రెజ్ ఆగ్రోవెట్ తెలంగాణలో ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, ఆగ్రో, వెటర్నరీ సర్వీసెస్, ఆగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో వ్యాపారం కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటి మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.

ఇక ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారవుతుంది. 2014 లోనే ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపారు.

నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినంలో ఉన్నాయి. ఆ కంపెని ఎండీ శ్రీ హార్దిక్ పటేల్‌, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈఓ శ్రీ వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి డా. బి. ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేలా రేవంత్ వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు.