Hyderabad: హైదరాబాద్‌లో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భారీ ట్రాఫిక్ నేపథ్యంలో చిన్న ప్రమాదం జరిగిన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు సోమవారం బల్దియా పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ బస్సు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న జీహెచ్‌ఎంసీ స్వీపర్‌పై నుంచి దూసుకెళ్లింది. దీంతో స్వీపర్ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే..
మొయినాబాద్‌లోని ఏయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్తుండగా రాంకోటిలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ స్వీపర్ సునీతను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సునీత చెట్టుకు, బస్సుకు మధ్య నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు విద్యార్థులు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో రాంకోటిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు డ్రైవర్ మహ్మద్ గౌస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, అతనిపై కేసు నమోదు చేసినట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. స్వీపర్ సునీత మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మేయర్ సునీత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: Telangana Election Campaign : ఎన్నికల ఖర్చుల కోసం ఎమ్మెల్యేకే డబ్బులు ఇస్తున్న ఓటర్లు..