ఈ ఏడాది ఆగస్టు 31న ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం కళాకారులు విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూలమైన విగ్రహాలను ప్రోత్సహించడానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సింథటిక్ రంగులతో తయారు చేసిన వాటిని నిరోధించడానికి నగర పాలక సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. నిమజ్జనం సమయంలో నీటి కాలుష్యానికి కారణం కాని విగ్రహాలను ప్రోత్సహించే కసరత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన జోనల్ ప్రాంగణంలో కాకుండా కీలక ప్రదేశాలలో మట్టి గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి అందరికి ఆదర్శంగా ఉండాలని భావిస్తుంది. అలాగే నగరంలోని మట్టి విగ్రహాల తయారీదారుల వివరాలను సేకరించి వారి ఫోన్ నెంబర్లను విగ్రహాల దగ్గర ప్రదర్శిస్తారు. నగర ప్రజలకు పర్యావరణ అనుకూలమైన గణేశ విగ్రహాలను తయారు చేసే కళాకారులు, పండళ్లను ఏర్పాటు చేసే వారి గురించి సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఉంది.
మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎల్‌బీ నగర్ జోనల్ కార్యాలయంలో మట్టితో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, మరో రెండు రోజుల్లో సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. ఆగస్టు 31న గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. ఈ నెలలోనే గణేష్ పండల నిర్వాహకులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లతో సమన్వయం చేసుకుని పర్యావరణ అనుకూల విగ్రహాల వైపు మార్గనిర్దేశం చేయాలని అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ రంగుల వల్ల పర్యావరణానికి కలిగే హానిపై విగ్రహాల తయారీదారులకు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా పండుగకు ముందు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుంది. మట్టి విగ్రహాలను తయారు చేసే వారిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం హుస్సేన్ సాగర్, విగ్రహాలు నిమజ్జనం చేసే ఇతర నీటి వనరులను నిశితంగా పరిశీలిస్తామని, నీటి లో పిఒపి విగ్రహాలను నిమజ్జనం చేయడాన్ని నిషేధిస్తూ హైకోర్టు ఆదేశాలను ఉన్నాయని అధికారులు గుర్తు చేశారు.