బట్టతల సమస్యను మహిళల కంటే ఎక్కువ పురుషులే ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం పోషకాహార లోపం. వాతావారణంలో కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, వంశపారపర్యం, అనారోగ్య సమస్యలు…ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పవచ్చు. జుట్టుకు సరైన పోషకాలు అందకపోతే..నిర్జీవంగా మారుతుంది. దీంతో అధికమొత్తంలో జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యలన్నింటని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.
శనగపిండి:
ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు జుట్టుకు బాగా అప్లై చేయాలి. గంట తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసం:
కొబ్బరి నూనెకు, ఉల్లిపాయ రసాన్ని కలుపుకుని తలకు బాగా పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే.. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.
దాల్చిన చెక్క పౌడర్, తేనె, ఆలివ్ ఆయిల్:
ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ కు తేనె, ఆలివ్ ఆయిల్ ను కలుపుకోవాలి. దీన్ని తలకు బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే జుట్టుకు తగిన పోషణ అందడంతోపాటు జుట్టు రాలడం తగ్గి బట్టతల సమస్య నుంచి బయటపడవచ్చు.
బీట్ రూట్ ఆకులు:
బీట్ రూట్ ఆకులలో జుట్టు పెరుగుదలకు సహాయపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకుని తల మాడుకు, జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఈవిధంగా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
ఆలివ్ ఆయిల్, నిమ్మరసం:
ఆలివ్ ఆయిల్ కు రెండు స్పూన్ ల నిమ్మరసం కలుపుకొని తలకు పట్టించాలి. అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం చుండ్రు, తలలో ఇన్ఫెక్షన్ లను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.అంతేకాదు జుట్టురాలే సమస్యలు తగ్గుతాయి.