Virat Kohli: వందో టెస్టులో కోహ్లీ శతక్కొట్టుడు ఖాయం

శ్రీలంకతో మొహాలీ వేదికగా జ‌రిగే తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్‌.

  • Written By:
  • Publish Date - March 1, 2022 / 11:22 PM IST

శ్రీలంకతో మొహాలీ వేదికగా జ‌రిగే తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్‌. పరుగుల యంత్రం కెరీర్‌లో అరుదైన మైలురాయిగా నిలిచే ఈ మ్యాచ్‌ కోసం అటు అభిమానులు ఇటు మాజీ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. గత కొంతకాలంగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ తన వందో టెస్టులో సెంచరీ సాధిస్తే చూడాలనుందన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుత తరంలో 100 టెస్టులు ఆడటమనేది అరుదైన మైలురాయి.

అలాంటిది ఆ టెస్టులో సెంచరీ సాధిస్తే ఆ కిక్కే వేరు .. తన వందో టెస్టులో ఒక గొప్ప ఇన్నింగ్స్‌తో తనేంటో కోహ్లి మరోసారి చూపిస్తాడు అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.. ఇక ఇప్పటి వరకు కేవలం తొమ్మిది మంది క్రికెటర్లు మాత్రమే తమ వందో టెస్టులో సెంచరీ సాధించారు. వీరిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఒక్కడే వందో టెస్టు రెండు ఇన్నింగ్సుల్లోనూ రెండు సెంచరీలు సాధించాడు. మరోవైపు విరాట్‌ కోహ్లి సుదీర్ఘ కాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. తన టెస్ట్‌ కేరిర్‌లో 99 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ కోహ్లీ .. 7962 పరుగులతో పాటు 27 సెంచరీలు సాధించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి దాదాపు రెండేళ్లు దాటింది. ఈ క్రమంలో కోహ్లీ తన 100వ మ్యాచ్‌లోనైనా సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.