BRS Minister: బండి సంజయ్ పై గంగుల కమలాకర్ ఫైర్

  • Written By:
  • Updated On - November 21, 2023 / 01:23 PM IST

BRS Minister: కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం అంబేద్కర్ స్టేడియం లో మార్నింగ్ వాక్ లో  పాల్గొని వాకర్స్ ను ఓటు అభ్యర్థించారు మంత్రి గంగుల. ప్రజలతో కలుపుగోలుగా మాట్లాడుతుంటే వారంతా గంగులకు మద్దతు పలుకుతూ నినాదాలు చేయడం విశేషం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఇతర నేతలతో కలిసి ప్రజలతో కలిసి ఆడుతూ ఈ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీని నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మోకాలడ్డినా సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు.

నాడు ఎంపీగా ఉన్న వినోద్ రావును, తనను పిలిచి ముఖ్యమంత్రి స్మార్ట్ సిటీ పనులను అప్పగించారని, నాడు ఇదే కార్పోరేషన్లో కార్పోరేటర్గా ఉన్న బండి సంజయ్ ను స్మార్ట్ సిటీ సాధన కోసం పోరాడుదామంటే రాకుండా పారిపోయారని, ఐనా 2018కల్లా కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులను కేంద్రం మెడలు వంచి పూర్తి చేసామన్నారు. అలాంటిది 2019లో ఎంపీగా గెలిచిన బండి స్మార్ట్ సిటీని తాను సాధించానని చెప్పుకోవడం ఆయన రాజకీయ అవివేకానికి, స్వార్థానికి నిదర్శనమన్నారు.

ఏనాడు కరీంనగర్, తెలంగాణ ప్రజల బాగోగులను పట్టించుకోని బండి, రాష్ట్రంలో మతాల మద్య చిచ్చుపెట్టి, కులాల కుంపట్లు రాజేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం హేయమన్నారు. ఇలాంటి వ్యక్తులకు తెలంగాణ రాజకీయాల్లో అవకాశం లేదని, అమూల్యమైన ఓటును జాగ్రత్తగా ఆలోచించి రేపు 30వతారీఖున ఓటుతో వారికి సరైన సమాదానం చెప్పాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ  కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, స్థానిక నేతలు చల్లా హరిశంకర్ ఇతరులు పాల్గొన్నారు.