Goldy Brar-Salman Khan : సల్మాన్ ఖాన్ టార్గెట్ అంటున్న గోల్డీ బ్రార్ ఎవరు ?

Goldy Brar-Salman Khan  : గోల్డీ బ్రార్.. సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపింది తానేనని ఒప్పుకున్న గ్యాంగ్‌స్టర్ ఇతడే..    హీరో సల్మాన్ ఖాన్ కూడా తన 'టార్గెట్' అని అతడు చెబుతున్నాడు.  

  • Written By:
  • Updated On - June 27, 2023 / 09:01 AM IST

Goldy Brar-Salman Khan  : గోల్డీ బ్రార్.. 

సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపింది తానేనని ఒప్పుకున్న గ్యాంగ్‌స్టర్ ఇతడే..    

హీరో సల్మాన్ ఖాన్ కూడా తన ‘టార్గెట్’ అని అతడు చెబుతున్నాడు.  

కెనడాలోని టాప్ 25 వాంటెడ్ క్రిమినల్స్‌లో గోల్డీ బ్రార్ ఒకడు..  

ఇంతకీ ఎవరు ఇతడు ? ఎందుకింత బరి తెగింపు ? 

గోల్డీ బ్రార్ ఎవరు ?

గోల్డీ బ్రార్ 1994లో పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలో జన్మించాడు. గోల్డీ బ్రార్ అసలు పేరు సతీందర్ సింగ్.  అతడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి చాలా సన్నిహితుడు. గోల్డీ బ్రార్ A ప్లస్ కేటగిరీ గ్యాంగ్‌స్టర్. గోల్డీ బ్రార్ బంధువు గుర్లాల్ సింగ్ పెహ్ల్వాన్ 2020 అక్టోబర్ 11న చండీగఢ్ పారిశ్రామిక ప్రాంతంలో డిస్కో వెలుపల హత్యకు గురయ్యాడు. బిష్ణోయ్, గోల్డీకి గుర్లాల్ చాలా సన్నిహితుడు. గోల్డీ బ్రార్, బిష్ణోయ్ లను కలిపిన గుర్లాల్ హత్య  పంజాబ్ లో అప్పట్లో కలకలం సృష్టించింది. ఈ హత్యకు కుట్ర పన్నింది గోల్డీ బ్రార్ అనే ఆరోపణలు ఉన్నాయి. గుర్లాల్ బ్రార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా గోల్డీ బ్రార్ పేరును పోలీసులు చేర్చారు. దీంతో గోల్డీ బ్రార్ తనను తాను రక్షించుకోవడానికి ఓ స్టూడెంట్ వీసాపై కెనడాకు పారిపోయాడు .ఇప్పుడు  అక్కడ నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు.

Also read : Chinese Spy Balloons: జపాన్, తైవాన్‌తో పాటు ఇతర దేశాలపై చైనా గూఢచారి బెలూన్‌లు.. కొత్త చిత్రాలు విడుదల..!

ముసేవాలాను ఎందుకు చంపాడు?

పంజాబీ హిప్ హాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు.. శిరోమణి అకాలీదళ్ నేత విక్కీ మిద్దుఖేరా హత్యతో సంబంధం ఉందని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వీకే భవ్రా గతంలో వెల్లడించారు. ప్రతీకారం కోసమే మూసేవాలాను హత్య చేశానని సోషల్ మీడియాలో గోల్డీ బ్రార్ ఓ పోస్ట్ పెట్టాడు. మిద్దుఖేరా హత్యకు ప్రతీకారంగా ఇలా చేశానని అందులో చెప్పాడు. “సిద్ధూ మూసేవాలా అహంభావి. తన రాజకీయ బలాన్ని, ధనబలాన్ని దుర్వినియోగం చేశాడు. అతనికి గుణపాఠం చెప్పాలని భావించా.. అందుకే ఒక పాఠం నేర్పించా” అని గోల్డీ బ్రార్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

జైలు నుంచి గోల్డీ బ్రార్ కు లారెన్స్ బిష్ణోయ్ ఆర్డర్స్ ?

అయితే.. శిరోమణి అకాలీదళ్ నేత మిద్దుఖేరాను హత్య చేసింది తామేనని బాంబిహా గ్యాంగ్ గతంలో ప్రకటించడం గమనార్హం. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. మర్డర్ కు గురైన గ్యాంగ్‌స్టర్ దావీందర్ బంబిహా కు చెందిన ముఠాల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ రెండు గ్యాంగ్‌లు ఒకరి అనుచరులను మరొకరు పలుమార్లు టార్గెట్ చేసుకున్నారు. గ్యాంగ్‌స్టర్ దావీందర్ బంబిహా చనిపోయినప్పటి నుంచి ఆ ముఠాను ఆర్మేనియాలోని జైలులో ఉన్న లక్కీ పాటియాల్ నడుపుతున్నాడని అంటున్నారు. లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నా.. బయట అతడి తరఫున యాక్టివిటీస్ అన్నీ గోల్డీ బ్రార్ చక్కబెడుతున్నాడని సమాచారం. జైలులో ఉన్న బిష్ణోయ్ నుంచి వచ్చే ఆర్డర్స్ ను గోల్డీ బ్రార్ అమలు చేస్తున్నాడని తెలుస్తోంది. గోల్డీ కెనడాలో కూర్చుని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో తన క్రైమ్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు. కెనడాలో ఉండటం వల్ల గోల్డీ బ్రార్(Goldy Brar-Salman Khan) తనను తాను భారత చట్టాల నుంచి రక్షించుకుంటున్నాడు.