Site icon HashtagU Telugu

Repalle : రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై సామూహిక అత్యాచారం.. భర్తను దారుణంగా కొట్టి..!

ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. సామూహిక అత్యాచార ఘటనలు మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి దారుణాలు నాలుగు చోటుచేసుకున్నాయి. బాపట్ల జిల్లాలో జరిగిన ఘటన స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రేపల్లె రైల్వేస్టేషన్ లో జరిగిన అత్యాచార ఘటన సంచలనం సృష్టించింది.

అవనిగడ్డలో పనుల కోసం భార్యాభర్తలు అర్థరాత్రి సమయంలో రేపల్లె రైల్వేస్టేషన్ లో దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లడానికి బస్సులు అందుబాటులో లేవు. తెల్లవారాక బస్సులో బయలుదేరుదామనుకున్నారు. అందుకే రైల్వేస్టేషన్ లో ఉన్న బల్లలపై పడుకున్నారు. కానీ ఆ టైమ్ లో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. ఆ మహిళను పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆమె భర్తను దారుణంగా కొట్టారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణం గురించి పోలీసులకు సమాచారం అందడంతో వాళ్లు నిందితుల వేట మొదలుపెట్టారు. వాళ్లు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలేనికి చెందినవారిగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచార ఘటన మరవకముందే ఈ దురాగతం చోటుచేసుకుంది. తుమ్మపూడి ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని.. నిందితులకు ప్రభుత్వం ఉందని చెబుతున్న దిశ చట్టం కింద 21 రోజుల్లో ఉరిశిక్ష విధించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఇప్పటివరకు దాదాపు 800 మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని ఆరోపించారు.