ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కేంద్ర మంత్రి గడ్కరీ గురువారం ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి, 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు
ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం బెంజ్ సర్కిల్‌కు చేరుకుని కొత్తగా నిర్మించిన వెస్ట్ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు. క్యాప్ కార్యాలయంలో రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి గౌరవార్థం ముఖ్యమంత్రి విందును ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర మంత్రి గడ్కరీ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకుని పూజలు చేయనున్నారు. అనంతరం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సాయంత్రం 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నాగ్‌పూర్‌కు బయలుదేరి వెళతారు. కేంద్రమంత్రి పర్యటన, బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.