Site icon HashtagU Telugu

France: వైన్స్ నాశనం చేయించడానికి రూ.1700 కోట్లు ఖర్చుపెట్టి ఫ్రాన్స్?

France

France

ఈ రోజుల్లో ప్రతి పదిమందిలో దాదాపు 8 మంది మద్యం సేవిస్తున్నారు. మద్యం తాగడం కోసం మద్యానికి బాగా బానిసలు అయిన వారు డబ్బులు ఖర్చు పెట్టి మద్యం సేవించడంతో పాటు అప్పులు చేసి మరీ మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. కానీ ఫ్రాన్స్‌ మాత్రం వారి దగ్గర ఉన్న మద్యం స్టాక్ ను వదిలించుకోవడం కోసం దాదాపుగా కోట్లు ఖర్చు చేస్తోంది.. అదేంటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఫ్రాన్స్‌ మద్యం స్టాక్‌ను వదిలించుకోవడానికి ఏకంగా 200 మిలియన్‌ యూరోలు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది.

తాజాగా దేశంలో అదనంగా ఉన్న వైన్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. వైన్‌కు మంచి ధర తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలో ఇది కూడా ఒక భాగం. అయితే ఇప్పటికే ఫ్రాన్స్‌లో ద్రవ్యోల్బణం, కోవిడ్‌ ప్రభావంతో పాటు క్రాఫ్టెడ్‌ బీర్‌కు దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌తో వైన్‌ తయారీదారులు నానా అవస్థలు పడుతున్నారు. వైన్‌ దిగ్గజాలైన బోర్డాక్స్‌, లాంగ్యూడాక్‌ సంస్థలు గణనీయంగా వైన్‌ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. మరొకవైపు డిమాండ్‌ పడిపోవడంతో ధర కూడా తగ్గిపోయింది. మేము విపరీతంగా వైన్‌ ఉత్పత్తి చేశాము. విక్రయధరలు ఉత్పత్తి ధరల కంటే తక్కువగా ఉన్నాయి. మేము భారీగా నష్టపోతున్నాం అంటూ లాంగ్యూడాక్‌ వైన్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌కు చెందిన జేన్‌ ఫిలిప్ప్‌ గ్రానియర్‌ పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆహారం, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు వ్యయాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ముఖ్యంగా వైన్‌ వంటి అనవసర ఖర్చులను కూడా తగ్గించేశారు. ఇకపోతే తాజాగా మద్యం కోసం కేటాయించిన 200 మిలియన్‌ యూరోలతో ఫ్రాన్స్‌ ప్రభుత్వమే ఈ స్టాక్‌ను కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత ధ్వంసం చేసి అందులోని ఆల్కాహాల్‌ను మాత్రం వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి కంపెనీలకు విక్రయించనుంది. దీంతో పాటు వైన్‌ తయారీ దారులు ఇతర మార్గాల్లో ఉపాధి వెతుక్కోడానికి నిధులను కేటాయించింది.