Naxal Attack : ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు వ‌రుస దాడులకు పాల్పడ్డారు.

  • Written By:
  • Publish Date - April 18, 2022 / 05:08 PM IST

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు వ‌రుస దాడులకు పాల్పడ్డారు. జిల్లాలోని బర్సూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మంగనార్ గ్రామంలో పీఎంజీఎస్‌వై రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న ఏడు ట్రాక్టర్లను మావోయిస్టులు ఆదివారం రాత్రి తగులబెట్టారు. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మహిళలు సహా 100 నుంచి 150 మంది సాయుధ మావోయిస్టులు భారీ, ఆధునిక ఆయుధాలతో గ్రామాన్ని చుట్టుముట్టి స్థానిక గ్రామ పంచాయతీ భవనం ముందు నిలిపి ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డు పనులు నిలిపివేయాలంటూ గ్రామ సర్పంచ్‌, కార్యదర్శి, కాంట్రాక్టర్‌ సంతోష్‌ల‌ను హెచ్చరిస్తూ బ్యానర్‌ కట్టారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో జిల్లాలోని కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్భా పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జ‌రిపారు. నక్సల్స్‌పై ఎదురుకాల్పులు జరిపిన భద్రతా బలగాలు వారిని వెనక్కి వెళ్లేలా చేశాయి. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు పోలీసులను రాయ్‌పూర్‌కు తరలించగా, ఇద్దరు బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

దక్షిణ బస్తర్‌లోని అడవులు, గ్రామాలపై డ్రోన్‌ల సహాయంతో ఏరియల్ బాంబ్‌బాండింగ్‌ను నిర్వహిస్తున్నారని ఛత్తీస్‌గఢ్ పోలీసులపై మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ చేసిన ఆరోపణలను బస్తర్ ఐజి సుందర్‌రాజ్ పి తోసిపుచ్చారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు ఆ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మావోయిస్టులు పక్కా ప్రణాళికతో పన్నిన కుట్ర అని ఆయ‌న తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ఈ ప్రాంతంలోని ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నాయని తెలిపారు. బస్తర్ ప్రాంతంలో గత 22 ఏళ్లలో మావోయిస్టుల చేతిలో 1700 మందికి పైగా అమాయక గ్రామస్తులు, అనేక మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు హతమయ్యారని… నక్సల్స్ 1100 సార్లు ఐఈడీ పేలుడు చేసి బీభత్సం సృష్టించారని తెలిపారు. బసవరాజు, సుజాత, గణేష్ ఉయికే, రామచంద్రారెడ్డి, చంద్రన్న వంటి బయటి మావోయిస్టు నాయకుల ప్రభావంతో చత్తీస్‌గఢ్ నక్సల్స్ స్థానిక ఆదివాసీ ప్రజలను బలిపశువులను చేస్తున్నారని.. స్థానిక మావోయిస్టు కార్యకర్తలు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని బ‌స్త‌ర్ ఐజీ సుందర్‌రాజ్ అన్నారు.