Drugs : హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తు ప‌ట్టుబ‌డ్డ విదేశీయులు

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 09:05 PM IST

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నలుగురు విదేశీయులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల మెథాంఫిటమైన్, 20 గ్రాముల కొకైన్, 5 సెల్‌ఫోన్లు, మొత్తం రూ.13 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్లు, ఒక టాంజానియా, యెమెన్ దేశస్థులను అరెస్టు చేశామని, కొకైన్, మెథాంఫెటమైన్ సరఫరా చేసే ఇద్దరు నైజీరియన్లు పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఢిల్లీలో నివాసముంటున్న నైజీరియన్ దివ్య ఎబుకాసుజీ ప్రధాన సరఫరాదారు పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న 17 మంది వినియోగదారులను కూడా పోలీసులు గుర్తించారు.

యెమెన్‌కు చెందిన అహ్మద్ కమల్ అహ్మద్ బఖ్ర్మువా (28), టాంజానియాకు చెందిన మథియాస్ ఎ షావా (35) మెథాంఫెటమైన్‌ను విక్రయిస్తున్నందుకు అరెస్టు చేశారు. ప్రధాన సరఫరాదారు బెంగళూరులో నివాసముంటున్న నైజీరియన్ ఎమ్మాన్యుయేల్ పరారీలో ఉన్నాడు. ఆరుగురు వినియోగదారులను గుర్తించగా వారు కూడా పరారీలో ఉన్నారు. మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసేందుకు బెంగళూరుకు తరచూ వస్తుంటారని, వాటిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి వినియోగదారులకు విక్రయించి సులభంగా డబ్బు సంపాదించేవారని నిందితులు పోలీసులకు తెలిపారు.

మరో కేసులో హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న ఐదుగురు విదేశీయులను పోలీసులు ప‌ట్టుకున్నారు. బంజారాహిల్స్‌లోని పారామౌంట్‌ కాలనీలో అనుమానాస్పదంగా తరలిస్తున్న వారి వద్ద ఎలాంటి పాస్‌పోర్టు, వీసా లేవని గుర్తించారు. వీరిలో ముగ్గురు నైజీరియన్లు కాగా మరో ఇద్దరు ఐవరీ కోస్ట్‌కు చెందిన వారు పాస్‌పోర్టులు, వీసాల గడువు ముగిసినా అక్కడే ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.