అశ్వారరావుపేట టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహాలక్ష్మీ తన గదిలో ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం మహాలక్ష్మీ తన గదిలో నుంచి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు కొట్టారు. ఎంతకీ స్పందించకపోవడంతో తలుపులు పగలకొట్టి గదిలోకి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించింది.
దీంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు షాక్‌కి గురైయ్యారు. వెంటనే ఆమెను కిందికి దించి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ..అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భద్రాచలం ఆసుపత్రికి చేరుకున్నారు. కూతురు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
