వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై నూజివీడు కోర్టు వంశీని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
బాపులపాడు ప్రాంతంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం వంశీని రెండు రోజులు కస్టడీలో ఉంచేందుకు అనుమతి లభించింది. పూర్తి నిజాలు వెలికితీయడంతో పాటు, సాక్ష్యాలను సేకరించాలనే ఉద్దేశంతో వంశీకి ఏడు రోజుల కస్టడీ అవసరమని హనుమాన్ జంక్షన్ పోలీసులు ఈ నెల 19న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపట్టిన నూజివీడు సెకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, ఇరు పక్షాల వాదనలు విని వంశీని రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీటీ వారెంట్ ఆధారంగా వంశీని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి రిమాండ్‌లోకి తరలించినట్లు సమాచారం. ఇప్పటికే వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.